మూడు రాజధానుల ఏర్పాటును అంబేద్కరే చెప్పారు..

ప్రజా సమస్యలే ఇతివృత్తాలుగా సినిమాలు నిర్మించే నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ఆంద్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి మరోసారి తన మద్దతును పునరుద్ఘాటించారు. మండలి లో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడిన నేపథ్యంలో నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సినీ పరిశ్రమ నుంచి మూడు రాజధానులు మద్దతుగా ఆది నుంచి నారాయణ మూర్తి ఒక్కరే మద్దతుగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మూర్తి.. మూడు రాజధానుల పై రాజ్యాంగ నిర్మాత మాటలను ప్రస్తావించారు.

పరిపాలన వికేంద్రీకరణ అన్ని చోట్ల ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, మూడు రాజధానులే ముద్దని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని అవ్వాలని ఆనాడే పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. అమ్మ తెలుగు భాష, నాన్న ఇంగ్లీష్‌ భాష అని అమ్మానాన్న కలయికే భాష అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయమన్నారు. తాను చదువుకునే సమయంలో ఉచిత ఆంగ్ల మాధ్యమాం లేక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకున్నారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా, నిన్న అసెంబ్లీ లో ఆంగ్ల మీడియం ప్రవేశ పెట్టడానికి సంభందించిన విద్య చట్టం సవరణ బిల్లుకు ఆమోదముద్ర పడింది. రాబోవు విద్య సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో భోధన జరుగుతుంది.

Show comments