ఒక తెలుగు దర్శకుడిపై అభిమానం కారణంగా మందుబాబులకు ఒక గంటపాటు పండగ వాతావరణం నెలకొంది. రూపాయికే క్వార్టర్ మందు దొరకడంతో ఆనందంతో మురిసిపోయారు. తమకు మందును రూపాయికే అందించిన వ్యక్తిని మనసారా మందుదాత సుఖీభవ అని ఆశీర్వదించారు. ఆ వ్యక్తి ఒక్క రూపాయికే మందు అందించడానికి గల కారణం తనకి అత్యంత ఇష్టమైన డైరెక్టర్ పెళ్లిరోజు కావడమే..
వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు తెలుగు సినిమా డైరెక్టర్ ఎన్ శంకర్ కు వీరాభిమాని. ఆయన రూపొందించిన ఎన్‌కౌంటర్ , జయం మనదేరా, జైబోలో తెలంగాణ లాంటి చిత్రాలను చూసి ఆయన వీరాభిమానిగా మారిపోయాడు. నవంబర్ 15 ఆదివారం నాడు శంకర్ పెళ్లిరోజు కావడంతో మందుబాబులకు రూపాయికే క్వార్టర్ మందు ఇప్పించాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం చందాపూర్ లోని ఓ వైన్ షాపు ఎదురుగా శంకర్ పెళ్లిరోజు సందర్భంగా రూపాయికే మందును అందిస్తున్నట్లు బ్యానర్ కట్టి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గంటపాటు రూపాయికే క్వార్టర్ మందును అందించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి సన్నిధిలో అన్నదానం చేశారు.
కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయిన ఎన్ శంకర్ అనంతరం శ్రీ రాములయ్య, యమజాతకుడు, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, జైబోలో తెలంగాణ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు. 2017లో ఆయన రూపొందించిన టూ కంట్రీస్ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అప్పటి నుండి మరే నూతన చిత్ర ప్రకటన ఆయన నుండి వెలువడలేదు..