Idream media
Idream media
సినిమా పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ వెళ్లిపోయారు. పోస్టర్ చిన్నబోయింది. ఆయన చేతి మీదుగా వచ్చిన పోస్టర్లతో మాలాంటి వాళ్ల బాల్యం రంగులమయమైంది. అప్పటి వరకూ హీరో, హీరోయిన్ల ఫొటోలు మెయిన్‌గా వేసి సైడ్‌లో మిగతా యాక్టర్ల తలలు వేసేవాళ్లు. ఈ ట్రెండ్‌ని ఈశ్వర్ మార్చారు. ఆయనెవరో తెలియకపోయినా పోస్టర్లని అలాగే చూస్తూ సినిమా చర్చలు జరిపిన రోజులు ఎన్నో వున్నాయి.
ప్రతి వూళ్లోనూ పోస్టర్ అంటించే సెంటర్లు వుంటాయి. రాయదుర్గంలో గర్ల్స్ స్కూల్ గోడ మెయిన్. కొత్త సినిమాలు, రాబోయే సినిమాల పోస్టర్లు ఫోర్‌షీట్స్ వేసేవాళ్లు. పాత సినిమాలైతే సింగిల్ షీట్. ఫోర్ షీట్స్ జాగ్రత్తగా అతికించకపోతే ముఖాల షేప్స్ మారిపోతాయి. పోస్టర్లు అతికించే బ్యాచ్ నిశాచరులు. రాత్రి సెకెండ్ షో నుంచి వచ్చేటపుడు ఎదురయ్యేవాళ్లు. సైకిల్‌కి ఒక బకెట్, దాంట్లో మైదా గమ్. చిన్న నిచ్చెన , పోస్టర్ల కట్ట. ఒకడు గోడకి నిచ్చెన వేసి ఎక్కితే ఇంకొకడు పోస్టర్లు అందించేవాడు.
అవి చూడడం ఒక వినోదం. ఎన్టీఆర్, కృష్ణ సినిమాలైతే ఆనందం. ఫైటింగ్‌లు ఉంటాయి కాబట్టి. శోభన్‌బాబుని చూస్తే చిరాకు. ఇద్దరు ఆడవాళ్లతో ప్రేమ, సరసాలు. ఈ గోల మాకెందుకు?
పోస్టర్లు చూసి కథ ఊహించుకునేవాళ్లం. నాగభూషణం, సత్యనారాయణలని చూస్తే భయం. జ్యోతిలక్ష్మి, జయమాలిని స్పెషల్ డ్రెస్‌లు ఆకర్షణ. అభిమానుల్లో కొందరు పిడకల స్పెషలిస్టులు. నచ్చని హీరోకి గురి చూసి పేడ ముద్ద విసిరేవాళ్లు.
1980 తర్వాత పోస్టర్ల సైజు క్వాలిటీ పెరిగింది. అనంతపురంలో జూనియర్ కాలేజీ గోడ ఇప్పటికీ పోస్టర్లకే ఫేమస్. తిరుపతిలో ప్రతాప్ థియేటర్ సెంటర్‌లో పెద్ద గోడ వుంది. జగదేకవీరుడు అతిలోక సుందరి, భైరవదీపం అతిపెద్ద పోస్టర్లు వేస్తే జనం నిలబడి మరీ చూసేవాళ్లు.
రాఘవేంద్రరావు తొలి సినిమాలు బాబు, జ్యోతి పోస్టర్ డిజైనింగ్ కొత్తగా వుండేది. బాలచందర్, బాపు , విశ్వనాథ్, వంశీల స్టైల్ డిఫరెంట్‌గా వుండేది. ఎవరికీ తెలియని జేవీ సోమయాజులతో శంకరాభరణం పోస్టర్ పడినప్పుడు దీన్నెవరైనా చూస్తారా? అని అనుమానం వచ్చింది.
ఇప్పుడు పోస్టర్ కల్చర్ మాయమవుతూ వుంది. అక్కడక్కడ కనిపిస్తూ వుంటాయి. హైదరాబాద్‌లో ఫిల్మ్ నగర్ నుంచి దర్గా వెళ్లే రోడ్డులో దర్శనం ఇస్తూ వుంటాయి. పోస్టర్ ఒక జ్ఞాపకం మాత్రమే. జ్ఞాపకాల్లో ఈశ్వర్ బతికే వుంటాడు.
Also Read : స్వర్గానికేగిన ఈశ్వర్ పోస్టర్