iDreamPost
android-app
ios-app

బ్యాంకులకు 338 కోట్లు టోకరా వేసిన ‘నిర్మాత

బ్యాంకులకు 338 కోట్లు టోకరా వేసిన ‘నిర్మాత

ఒక తెలుగు సినిమా నిర్మాత మోసం చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన రోబో తెలుగు హక్కులు కొనుక్కుని తెలుగు నిర్మాతగా విడుదల చేసిన తోట కన్నారావు ఇప్పుడు ఒక భారీ మోసం కేసులో వెలుగులోకి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఎర్నగూడెంకి చెందిన తోట కన్నారావు ఎగ్జిబిటర్ గా పలు సినిమాలకు వ్యవహరించారు. తర్వాత రోబో సినిమా తెలుగు హక్కులు కొని విడుదల చేయడంతో కోట్ల రూపాయల లాభాలు కూడా ఆర్జించారు. అయితే ఆయన తాజాగా ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులను మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కెనరా బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకుల నుంచి ఆయన డబ్బు పొంది ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది.

338.37కోట్ల మేర మోసగించిన క్రమంలో తోట కన్నారావు సహా ఆయన భార్య మీద, వారికి సహకరించిన పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తోట కన్నారావు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, అతని భార్య వెంకటరమణ డైరెక్టర్‌గా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో శ్రీ కృష్ణా స్టాకిస్ట్‌ అండ్‌ ట్రేడర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో వేప చెట్ల పెంపకం, విత్తనాలు శుద్ధి చేసి ఔషధాల తయారీ, మొక్కజొన్న విత్తనాల వ్యాపారం చేస్తున్న కారణంగా శ్రీ కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ నెట్‌వర్త్‌ రూ. 744.88 కోట్లని, తన భార్య నెట్‌వర్త్‌ రూ.62.70 కోట్లని బ్యాంకులకు నమ్మించి ఈ మేర రుణాలు పొందారు.

అప్పటికి రూ.232.08 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెబుతూ వివిధ ప్రాంతాల్లో తనకు ఉన్న 13 ఓపెన్ ప్లాట్లు, ఒక రెసిడిన్షిల్ ఫ్లాట్ తాకట్టుపెట్టి కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో కన్సార్టియం వద్ద 152 కోట్లు, ఐడిబీఐ బ్యాంక్‌ రూ.30 కోట్ల రుణం తీసుకున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చిందని 2017లో దివాలా తీసినట్టు ప్రకటించడంతో తాము తాకట్టుపెట్టుకున్న ఆస్తులు విలువ ఎంత ఉందో చూసేందుకు వెళ్లిన బ్యాంకులకు ఆ ఆస్తుల విలువ కేవలం రూ.28.34 కోట్లని తెలిసి షాక్ అయ్యారు. డబ్బు చెల్లించకపోవడంతో బ్యాంకు సర్కిల్‌ కార్యాలయ జీఎం టి.వీరభద్రారెడ్డి ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ బ్యాంకును మోసగించి రుణం పొందడమే కాకుండా, రూ.338.37 కోట్లు నష్టం వాటిల్లేలా కుట్రపన్నారు అని జీఎం ఫిర్యాదుపై విచారణ జరిపి, హైదరాబాద్‌లోని సీబీఐలోని ఏసీబీ విభాగానికి కేసు బదిలీ చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : షారుఖ్ కొడుక్కి షాక్.. మరో 14 రోజులు జైల్లో..