iDreamPost
iDreamPost
ఒకప్పుడు ఆర్బి చౌదరి నిర్మాతగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మంచి పేరుండేది. స్టార్ హీరోలైనా లేక అప్ కమింగ్ యాక్టర్స్ ఎవరైనా సరే కాంబినేషన్లు పట్టించుకోకుండా మరీ వెళ్లేవారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అగ్ర సంస్థలను ఓవర్ టేక్ చేశారా అనే రేంజ్ లో దీని హవా కొన్నేళ్లు నడిచింది. సూర్యవంశం, సుస్వాగతం, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా లాంటి బ్లాక్ బస్టర్లు సిల్వర్ జూబ్లీలు చేసుకున్నాయి. కాకపోతే ఇవన్నీ రీమేకులు. ఒరిజినల్ వెర్షన్లను మించి ఆడినవి కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చేసిన కొన్ని స్ట్రెయిట్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి ప్రియమైన నీకు.
నువ్వే కావాలి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తో తెరకు పరిచయమైన తరుణ్ కు ఆ స్టార్ డం నిలబెట్టుకోవడం పెద్ద సవాల్ గా ఉండేది. కథల ఎంపికలో చేసిన పొరపాట్లకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 1997లో తమిళంలో వచ్చిన లవ్ టుడేతో కోలీవుడ్ లో అడుగు పెట్టిన దర్శకుడు బాలశేఖరన్ డెబ్యూతోనే ఘనవిజయం అందుకున్నారు. దీన్నే తెలుగులో పవన్ కళ్యాణ్ తో సుస్వాగతంగా రీమేక్ చేస్తే ఇక్కడా అదే ఫలితం దక్కింది. ఇది కూడా ఆయనే డైరెక్ట్ చేయాలన్న ఆలోచన శేఖరన్ ది. కానీ అవకాశం భీమినేని శ్రీనివాసరావుకు దక్కింది. దీంతో మరో స్ట్రెయిట్ సినిమా ఇస్తానని మాట ఇచ్చిన నిర్మాత ఆర్బి చౌదరి ప్రియమైన నీకు రూపంలో దాన్ని వేరవేర్చారు
ఇది ముక్కోణపు ప్రేమకథ. బయటికి చెప్పకుండా మౌనంగా తనను ప్రేమించిన యువతిని గెలుచుకునే ఓ ప్రేమికుడి స్టోరీగా బాలశేఖరన్ దీన్ని ప్రెజెంట్ చేశారు. హీరోయిన్ స్వంత చెల్లే అసూయతో అక్కకు దక్కాల్సిన వాడి మీద మనసు పారేసుకోవడం అసలు ట్విస్ట్. పాయింట్ మరీ కొత్తది కాకపోయినా కథనాన్ని నడిపించిన తీరు, చింతపల్లి రమణ సంభాషణలు, అన్నింటిని మించి ఎస్ఏ రాజ్ కుమార్ అద్భుతమైన పాటలు ప్రియమైన నీకుని సూపర్ సక్సెస్ చేశాయి. 2001 ఫిబ్రవరి 21 విడుదలైన ఈ సినిమా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం నాలుగు రోజులు ముందు రిలీజైన మహేష్ బాబు మురారిని తట్టుకుని మరీ ఆడింది. 2003లో దీన్నే తమిళ నటులతో కొంత భాగం రీ షూట్ చేసి కాదల్ సుగమనాతుగా డబ్బింగ్ చేసి విడుదల చేయడం విశేషం
Also Read : Kshemanga Velli Labhamga Randi : క్షేమంగా చూపించి లాభాలను ఇచ్చింది – Nostalgia