iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ ఏడాది వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ముఖ్యంగా అపరాలతో పాటు పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి రైతుకు లభిస్తోంది. కోవిడ్ నేపథ్యంలోనూ రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను కొనుగోలు చేసింది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుము, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధర దక్కేలా చేసింది. ఆ ప్రభావం ఈ ఏడాది వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలపై కన్పిస్తోంది.
వ్యాపారుల మధ్య పోటీ..
మార్క్‌ఫెడ్ ద్వారా 2019–20లో 3,16,610 మంది రైతుల నుంచి రూ.3,735.56 కోట్ల విలువైన 9,83,189 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.103.45 కోట్ల విలువైన 12.93 మిలియన్ కిలోల పొగాకును కిలో రూ.81 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది 2020–21లో 1,23,652 మంది రైతుల నుంచి రూ.2,420.09 కోట్ల విలువైన 8,28,211.55 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకుంటుండడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఈ కారణంగా ఈ ఏడాది ఊహించని విధంగా వ్యవసాయ, వాణిజ్య పంటల రైతులకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. గత మూడేళ్లలో దక్కని ధరలు లభిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2021–22 సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 1,766 మంది రైతుల నుంచి రూ.14.62 కోట్ల విలువైన 3,665 టన్నుల ఉత్పత్తులను మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి ఆలోచన మేరకు సీజన్ ముగిసే సమయంలో ఎమ్మెస్పీ, క్వాలిటీ పట్ల రైతుల్లో అవగాహన కల్పించడం, కోతలకు ముందుగానే కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయడం వలన వ్యాపారుల మధ్య పోటీకి కారణమైంది.
పెరుగుతున్న వాణిజ్య పంటల ధరలు..
ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే అపరాలు, వాణిజ్య పంటల ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి. ప్రధానంగా పత్తి, మిరప, పసుపు, మినుము, వేరుశనగ, టమాటా పంటలు రికార్డు స్థాయి ధర పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా పసుపు, పత్తి, మిరప పంటలకు ఈసారి మంచి ధర పలుకుతోంది. మిగిలిన పంటలకు సంబంధించి మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. పసుపు ఓ దశలో రూ.7,900 వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.7,250 వద్ద నిలకడగా ఉంది. ఇక పత్తి అయితే ఈసారి రైతులకు సిరులు కురిపించింది. తొలిసారి క్వింటాల్ రూ.9,600 మార్క్‌ను అందుకుంది. కొత్త ఏడాదిలో రూ.10 వేల మార్క్‌ను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. క్వాలిటీ మిరప తొలిసారిగా క్వింటాల్ రూ.20 వేల మార్క్‌ను అందుకుంటోంది. రూ.13 వేలతో మొదలై.. నెమ్మదిగా ఎగబాకుతోంది. తామర పురుగు ప్రభావంతో ఈసారి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇది కూడా ధర పెరిగేందుకు దోహద పడిందంటున్నారు. వేరుశనగ ధర కూడా ఎమ్మెస్పీకి మించి పలుకుతోంది. ఓ దశలో కందులు, పెసల ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. రెండేళ్లుగా కనీస మద్దతు ధర దక్కని మొక్క జొన్న మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఎమ్మెస్పీకి ధీటుగానే పలుకుతోంది.
Also Read : ఏపీలో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతోంది..?