iDreamPost
android-app
ios-app

కనిపించని ప్రేమకు ప్రేక్షకులు ఫిదా – Nostalgia

  • Published Aug 10, 2021 | 12:23 PM Updated Updated Aug 10, 2021 | 12:23 PM
కనిపించని ప్రేమకు ప్రేక్షకులు ఫిదా – Nostalgia

మాములుగా ప్రేమకథలను ప్రతిసారి కొత్తగా చెప్పలేమనే వాస్తవం ఒప్పుకోవాలి. కాకపోతే కొంత నవ్యతతో ఆలోచిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని బాషతో సంబంధం లేకుండా చాలాసార్లు ఋజువయ్యింది. దానికో చక్కని ఉదాహరణ ప్రేమలేఖ. 1990లో ఇండస్ట్రీకి వచ్చిన అజిత్ కు తొలినాళ్ళలో మరీ గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్లు దక్కలేదు. హిట్లు పడ్డాయి కానీ మార్కెట్ బలపడేంత స్థాయి వాటికి దక్కలేదు. తెలుగులోనూ 1993లో ప్రేమపుస్తకం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ దానికి చేదు ఫలితం దక్కింది. రెండు పడవల ప్రయాణం వద్దనుకుని తిరిగి చెన్నై వెళ్ళిపోయి పూర్తి ఫోకస్ తమిళ సినిమాల మీదే పెట్టాడు. అప్పుడు వచ్చిందీ మాస్టర్ పీస్.

దర్శకుడు అగతియన్ కు అప్పటికి కేవలం మూడు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అప్పుడు రాసుకున్న కథే కాదల్ కోట్టై. ఒకరకంగా చెప్పాలంటే ఈ కథకు మన యండమూరి రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవల స్ఫూర్తి అని చెప్పాలి. అందులో పాయింట్ ని తీసుకుని హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండా ప్రాణానికి ప్రాణంగా కేవలం ఉత్తరాల ద్వారా ప్రేమించుకోవడం అనే ప్లాట్ మీద మంచి డ్రామా రాసుకున్నారు అగతియన్. అజిత్ కి జోడిగా దేవయాని సెకండ్ హీరోయిన్ గా హీరా ఎంపిక కాగా ఏఆర్ రెహమాన్ ప్రభంజనం కొనసాగుతున్న టైంలోనూ దేవా తన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతమైన మెలోడీలు సిద్ధం చేశారు

1996 జూలైలో విడుదలైన ఈ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోయినా స్వచ్ఛమైన ప్రేమను చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చిన్న చిన్న ట్విస్టులు, పాటలు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ఉత్తమ దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాలలో దీని రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ఫిలిం ఫేర్ లాంటి పురస్కారాలు ఎన్ని వచ్చాయో లెక్క లేదు. దెబ్బకు అజిత్ కు ఒక్కసారిగా మార్కెట్ తో పాటు ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తెలుగులో అదే సంవత్సరం డిసెంబర్ 6న ప్రేమలేఖ రిలీజ్ చేస్తే ఇక్కడా ఘనవిజయం అందుకుంది

Also Read : చిత్ర విచిత్రాల భలే హాస్యం – Nostalgia