iDreamPost
iDreamPost
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) అనేది ఒక సామాజిక భద్రతా పథకం. 2015 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాల్లో ఇది కూడా ఒకటి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY)తో పాటు దీన్ని కూడా ప్రకటించారు. అయితే ఈ సురక్షా బీమా యోజన పథకం అంటే ఏంటో, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ఒక ప్రమాద బీమా పథకం. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ప్రతి ఏటా దీన్ని అప్ డేట్ చేసుకోవాలి. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న ఎవరైనా ఈ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలో చేరొచ్చు. ఇందుకోసం ఏదైనా బ్యాంకులో ఖాతా ఉండాలి. ఉమ్మడి ఖాతా ఉంటే ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరొచ్చు. NRIలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చిన సమయంలో లబ్ధిదారుడికి లేదా నామినీకి భారత కరెన్సీలోనే చెల్లిస్తారు.
ఈ పథకానికి ప్రీమియం చాలా తక్కువ. తాజాగా ఈ పథకానికి ప్రీమియం ఏడాదికి రూ.20లు మాత్రమే. ప్రతి సంవత్సరం చెల్లింపులకు ఆటో డెబిట్ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ పద్ధతిలో 20 రూపాయలు కట్ చేసుకునే సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. చందాదారులకు బ్యాంకులు పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్‌ను జారీచేయవు.
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద చందాదారుడు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా, రెండు చేతులు/కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోయినా దానిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు. ఇది ఎలాంటి మెడిక్లెయిమ్ పాలసీ కాదు కాబట్టి ఎలాంటి ఆసుపత్రి ఖర్చులూ రావు. కేవలం ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత, పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం మాత్రమే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద కవర్ అవుతాయి. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది.
ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే బ్యాంకుల సహకారంతో ఇతర సాధారణ బీమా సంస్థల నుంచి పొందవచ్చు. బ్యాంకులు వారి చందాదారుల కోసం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధారణ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ పథకంలో చేరడానికి దగ్గర్లో ఉన్న బ్యాంకు లేదా, ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థల్ని సంప్రదించొచ్చు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా PMSBYకి నమోదు చేసుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్నవారు ముందుగా నెట్ బ్యాంకింగ్ లాగినయ్యి ఇన్సురెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఏ ఖాతాను ఉపయోగించి ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో ఆ ఖాతాని ఎంచుకోవాలి. అన్ని వివరాలను ఎంట్రీ చేసి, తనిఖీ చేసుకుని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత వచ్చే ‘ఎక్‌నాలెజ్డ్‌మెంట్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం దీన్ని భద్రపరచుకోవాలి. బ్యాంకు పొదుపు ఖాతాకు ఇచ్చిన నామినీనే ఇక్కడ ఆటోమేటిక్ గా సూచిస్తుంది. మనం కావాలంటే ఆ నామినీనే ఉంచొచ్చు లేదా కొత్త నామినీని పెట్టుకోవచ్చు. ఒక్కో బ్యాంక్ కి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది.
చందాదారుని వయసు 70 ఏళ్లు దాటిన తర్వాత, ఒకవేళ బ్యాంకు ఖాతాను మూసేస్తే లేదా బీమాను చెల్లించడానికి సరిపడా మొత్తం మీ ఖాతాలో లేకపోతే ఆటోమేటిక్ గా ఈ పథకం రద్దు అవుతుంది. ఒకవేళ మనం ఒకటి కంటే ఎక్కువ ఖాతాల ద్వారా పథకంలో చేరి ప్రీమియం చెల్లించినా బీమా కవర్ కేవలం ఒక ఖాతాకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సమర్పిస్తే PMSBY పథకం కింద క్లెయిమ్ నామినికి మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం వంటి మరణాలు సంభవించినట్లైతే వాటిని పోలీసులు, అలాగే పాము కాటు, చెట్టుపై నుంచి కింద పడి చనిపోయినట్లైతే ఆ మరణాలను ఆసుపత్రి వారు ధ్రువీకరించి సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడే బీమా మొత్తం వస్తుంది. ఒకవేళ నామిని లేకపోయినా చట్టపరమైన వారసులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే వైకల్యం తాలూకా క్లెయిమ్‌లు మాత్రం చందాదారుడి బ్యాంకు ఖాతాలోనే జమవుతాయి.