iDreamPost
iDreamPost
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఏదో విధంగా అడ్డుకోవడం.. ప్రతి నిర్ణయాన్ని తప్పుడు కోణంలో ప్రొజెక్టు చేసి ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది. అయితే ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి బాగా తెలుసు. గత టీడీపీ హయాంలో జరిగిందేమిటో ఇంకా బాగా తెలుసు. అందుకే టీడీపీ నేతలు చేస్తున్న విన్యాసాలను నమ్మకపోగా.. అనేక చోట్ల వారిపై తిరగబడుతున్న సంఘటనలు ఉన్నాయి. తాజాగా విశాఖ నగర శివారు పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతలకు అటువంటి పరాభవమే ఎదురైంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల కోసం మట్టి తవ్వుకుంటున్న పేదలను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించి.. మట్టి అమ్ముకుంటున్నారని రచ్చ చేయబోయిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ బృందానికి పేద లబ్ధిదారులు బుద్ధి చెప్పి పంపించారు.
పునాదులు నింపడానికి మట్టి తవ్వకాలు
పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పిలివానిపాలెంలో జగనన్న ఇళ్ల కాలనీ పథకం కింద ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. సర్వే నంబర్ 81/2లో వేసిన లే అవుట్లో మొత్తం 90 మందికి స్థలాలు ఇచ్చారు. పలువురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించారు. పునాదులను నింపడానికి సమీపంలోని కొండ వాలులో మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ తదితరులు అక్కడికి వెళ్లి పేదలను అడ్డుకున్నారు. మీరంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలే.. మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ మట్టి తవ్వడానికి వీల్లేదని రుబాబు చేశారు.
తిరగబడిన పేదలు
టీడీపీ నేతల ఆరోపణలను ఖండించిన పేదలు.. తామంతా ఇళ్ల పథకం లబ్ధిదారులమని.. నిర్మాణాల కోసం మట్టి తవ్వుతున్నామని వివరించారు. అయినా వినిపించుకోని బండారు బృందం వైఎస్సార్సీపీ కార్యకర్తలు మట్టి అమ్ముకుంటున్నారన్న కలరింగ్ ఇస్తూ రచ్చ చేయడానికి ప్రయత్నించారు. దాంతో ఆగ్రహించిన పేదలు వారిపై తిరగబడ్డారు. ఎవరు మట్టి అమ్ముకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ హయాంలో ఒక్క ఇల్లయినా ఇచ్చారా.. మీరు ఇవ్వకపోగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను నిర్మించుకోకుండా అడ్డుకుంటారా.. అని ప్రశ్నించారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇంతటి ప్రతిఘటనను ఊహించని బండారు బ్యాచ్ అవాక్కయ్యారు. ఏం చేయాలో పాలుపోక సమీపంలో ఉన్న ఒక చెట్టు కింద కాసేపు నిలబడిపోయి.. షరా మామూలుగా ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పించి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.
Also Read : అమరావతి రైతులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్..!