iDreamPost
android-app
ios-app

పేదల ఇళ్ళ నిర్మాణానికి రాజకీయ గ్రహణం 

  • Published Oct 10, 2021 | 1:19 AM Updated Updated Mar 11, 2022 | 10:38 PM
పేదల ఇళ్ళ నిర్మాణానికి రాజకీయ గ్రహణం 

హై కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పేదలందరికీ ఇళ్ళు పధకం తాత్కాలికంగా వాయిదా పడింది. చాలా యేళ్ళ తర్వాత, ఆ మాటకొస్తే దశాబ్దాల తర్వాత ప్రభుత్వాలు పేదలకు ఇళ్ళస్థలాలు పెద్దఎత్తున ఇవ్వడం ఇదే మొదలు. 

అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా “గరీబీ హఠావో” నినాదంతో పేదలందరికీ దేశవ్యాప్తంగా ఇళ్ళస్థలాలు ఇచ్చాయి ప్రభుత్వాలు. అవకాశాన్ని బట్టి 1970 దశకంలో గ్రామాల్లో ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు. అప్పటి నుండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ స్థలాల్లోనే ఎన్టీఆర్ హయాంలో పెంకుటిళ్ళు, వైఎస్సార్ హయాంలో పక్కా ఇళ్ళ నిర్మాణం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యకాలంలో మరికొంత విస్తృతంగా కొనసాగించి మరిన్ని ఇళ్ళు నిర్మించారు. 

ఈ పధకానికి కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయం ఉండడం, ఉపాధి హామీ పధకంలో ఈ పనులు కొంతమేర చేర్చే అవకాశం ఉండడంతో చంద్రబాబు హయాంలో కాస్త ఎక్కువగానే గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, సిమెంటు రోడ్ల నిర్మాణం జరిగింది. అయితే ఆయా నిర్మాణాల నాణ్యత ప్రస్తావిస్తే అదో పెద్ద చర్చ అవుతుంది. 

ఇక ఇళ్ళ స్థలాల విషయానికి వస్తే 1970 తర్వాత ఇళ్ళ స్థలాలేవీ ఇవ్వలేదు కాబట్టి అప్పట్లో ఇచ్చిన స్థలాల్లోనే ఇప్పటివరకూ ఇళ్ళ నిర్మాణం జరిగింది. 1970 నుండి 2020 వరకు అంటే 50 సంవత్సరాల వరకూ కొత్తగా వచ్చిన ఇళ్ళస్థలాలు లేకపోవడంతో అందులోనే అన్నదమ్ములు పంపకాలు చేసుకుని అక్కడే ఇళ్ళ నిర్మాణం కూడా చేసుకున్నారు. 1970లో ఐదు సెంట్ల స్థలం పొందిన కుటుంబంలో ఇప్పటికి రెండు తరాలు వచ్చాయి. మూడో తరం పిల్లలు పెళ్ళిళ్ళకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నేళ్ళు వీరంతా అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో మినహా  ఆ స్థలాల్లోనే నివాసం ఉంటున్నారు. 

ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు కొత్తగా ఇళ్ళస్థలాలు ఇవ్వడం చిన్నవిషయమేమీ కాదు. అందుకోసం భూసమీకరణ లేదా కొనుగోలు అంత చిన్న వ్యవహారం కూడా కాదు. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరిగిన భూ యజమానులు ప్రభుత్వ ధరలకు తమ భూములు ఇచ్చే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు, మార్కెట్ వాల్యూ వేరు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో భూములు మార్కెట్ వాల్యూకి కొనుగోలు చేయడం సాధ్యమయ్యేపని కాదు. 

Also Read : తరతరాల సమస్య.. శాశ్వత పరిష్కారం.. జగన్‌ చారిత్రాత్మక అడుగు

ఇక పట్టణాల్లో అయితే భూసేకరణ లేదా సమీకరణ అసాధ్యం. అంతో ఇంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసిన పట్టాన ప్రాంత భూ యజమానులు ప్రభుత్వానికి అంత తేలిగ్గా భూమి ఇస్తారని ఎవరైనా అనుకుంటే అది అత్యాశ లేదా అమాయకత్వం అనుకోవాల్సిందే. 

ఇలాంటి పరిస్థితిలో పట్టణాల్లో ఒక సెంటు స్థలం, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా ఓ చారిత్రక విజయమే. అలాంటి ఓ సాహస కార్యాన్ని జగన్మోహన్ రెడ్డి తలపెట్టినప్పుడు అభినందించాల్సిన రాజకీయ నాయకులూ, కోర్టులూ అందులో లోపాలు వెతకడం, మొత్తం కార్యక్రమాన్ని నిలిపివేయడం ఎలా సమర్ధనీయమో అర్ధం కావడం లేదు. 

పట్టణాల్లో ప్రభుతం ఇస్తున్న ఒక సెంటు స్థలం అంటే 435.56 చదరపు అడుగులు. అలాగే గ్రామాల్లో ఇస్తున్న సెంటున్నర స్థలం అంటే 653.34 చదరపు అడుగులు. ఈ విస్తీర్ణం అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోదని, అలాంటి నివేదికలేవీ లేవని కోర్టు తప్పు పట్టడం ఏ ప్రమాణాల మేరకు ఆమోదయోగ్యమో తెలియాల్సి ఉంది. 

ఇప్పటివరకూ అన్ని ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్ళ విస్తీర్ణం ఎంత? చాలా గ్రామాల్లో కేవలం రెండుగదుల ఇళ్ళే నిర్మించిన సంగతి కోర్టులకు తెలియదా? రెండు గదులు కలిపి ఎంత విస్తీర్ణంలో నిర్మించారో కోర్టుల్లో ఉండే న్యాయ నిపుణులకు తెలియదా? అలాగే టిడ్కొ ద్వారా చంద్రబాబు హయాంలో నిర్మించిన ఇళ్ళ లేదా ఫ్లాట్ ల విస్తీర్ణం ఎంత? ఒక్కో ఫ్లాట్ 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 420 చదరపు అడుగులు కాదా!? వీటితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన 435.56 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు పెద్దది కాదా?

ఇలాంటి సాంకేతిక అంశాలు పరిశీలనలోకి తీసుకోకుండా ఓ పెద్ద కార్యక్రమాన్ని అలా కోర్టుద్వారా అడ్డుకుంటే ప్రజలు మద్దతిస్తారా? ముప్పై లక్షల కుటుంబాలు లబ్ది పొందకుండా కాలు అడ్డం పెడితే రాజకీయంగా ఆమోదిస్తారా? అంతర్జాతీయ ప్రమాణాలేవీ పాటించని కారణంగానే కోర్టులు నిలిపివేశాయి అని చెప్పినా జనం నమ్ముతారా? ఇలా అడ్డుకోవడంలో రాజకీయం లేదని ప్రజలు విశ్వసిస్తారా అని కూడా ఆలోచన చేయకుండా, ఐదు దశాబ్దాల తర్వాత వస్తున్న ఇంటిస్థలాన్ని అడ్డుకోవడాన్ని జనం అంగీకరిస్తారా అని చూసుకోకుండా ప్రతిదీ రాజకీయం చేయడం ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు మాత్రమే చెల్లింది.

Also Read : ఇళ్ల నిర్మాణాల నిలిపివేత ఆదేశాలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం