iDreamPost
android-app
ios-app

పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ

  • Published Sep 30, 2022 | 3:46 PM Updated Updated Dec 05, 2023 | 12:43 PM

ఎన్నడూ లేని రీతిలో ప్యాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు చూసేయాలన్న ఆడియన్స్ గట్టిగానే ఉన్నారు.

ఎన్నడూ లేని రీతిలో ప్యాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు చూసేయాలన్న ఆడియన్స్ గట్టిగానే ఉన్నారు.

పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ

కోలీవుడ్ అతి పెద్ద క్యాస్టింగ్ తో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ పై ఎన్ని అంచనాలు ఉన్నాయో చూస్తూ వస్తున్నాం. ఎన్నడూ లేని రీతిలో ప్యాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు చూసేయాలన్న ఆడియన్స్ గట్టిగానే ఉన్నారు. బీసీ సెంటర్స్ లో పెద్దగా హైప్ లేదు కానీ నగరాలు పట్టణాల్లో బుకింగ్స్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే నమోదయ్యాయి. అయిదు వందల కోట్లతో రెండు భాగాలుగా రూపొందిన ఈ గ్రాండియర్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం, డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టే లైకా ప్రొడక్షన్స్ లాంటి సంస్థ దొరకడం ప్లస్ అయ్యాయి. ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

వేయి సంవత్సరాల క్రితం చోళ సామ్రాజ్యం నడుస్తున్నప్పుడు ఆకాశంలో తోకచుక్క పుట్టి ఏదో ప్రమాదాన్ని శంకిస్తుంది. యువరాజు ఆదిత్య కరికాలుడు(విక్రమ్)మిగిలిన రాజ్యాల్ని ఆక్రమిస్తూ శ్రీలంకపై దండయాత్రకు వెళ్లిన తమ్ముడు పొన్నియన్ సెల్వన్(జయం రవి) ని తీసుకురమ్మని తన సైన్యంలో ఉండే ఆప్తుడు వల్లవరాయ(కార్తీ)ని దూతగా పంపిస్తాడు. మరోవైపు చోళ వంశ నాశనానికి నడుం బిగించిన పాండ్య వంశస్థులు వీళ్ళను నాశనం చేసేందుకు బయలుదేరతారు. ఈ పరిణామాలకు పరోక్షంగా పావులు కదుపుతున్న నందిని(ఐశ్యర్యరాయ్)తో పాటు ఆదిత్య చెల్లి(త్రిష)ను కలుసుకుంటాడు వల్లవరాయ. ఆ తర్వాత జరిగేది తెరమీదే చూడాలి

నటీనటులు

ముందు నుంచి ప్రమోషన్లలో ప్రొజెక్టు చేసినట్టు మనం అనుకున్నట్టు ఇందులో టైటిల్ రోల్ చేసింది విక్రమ్ కాదు జయం రవి. చియాన్ ఫ్యాన్స్ కనక ఏదేదో ఊహించుకుంటే నిరాశ తప్పదు. అంత పెద్ద నిడివిలో ఇతను కనిపించేది మహా అయితే పావు గంటకన్నా ఎక్కువ ఉండదు. కాకపోతే మధ్యమధ్యలో చూపించడంతో మాయాబజార్ లో పాండవుల్లా ఉండీ ఉండనట్టు ఫీలవుతాం. ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తీ వన్ మ్యాన్ షో అయ్యింది. యాక్షన్ కన్నా ఎక్కువగా తన కామెడీ డైలాగ్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. రెండో సగంలో ఎంట్రీ ఇచ్చే జయం రవి పొన్నియన్ సెల్వన్ రేంజ్ లో విగ్రహం లేదు కానీ గాంభీర్యం, నిగ్రహం నిండుగా ఉండటంతో ఏదో పాస్ అయిపోయాడు.

చాలా కాలం తర్వాత ఐశ్వర్య రాయ్ ను తెరమీద చూడటం ఆమె ఫ్యాన్స్ కు కనువిందే. యాభై వయసుకు దగ్గరగా ఉన్నప్పటికీ చెక్కుచెదరని ఆ సౌందర్యానికి వావ్ అనకుండా ఉండలేం. పెర్ఫార్మన్స్ కూడా ఓకే. త్రిష అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. శోభిత ధూళిపాళ జస్ట్ ఓకే. తనతో పోల్చుకుంటే ఐశ్వర్య లక్ష్మి బెటర్. శరత్ కుమార్, పార్తీబన్, ప్రకాష్ రాజ్, లాల్, ప్రభు ఇలా వృద్ధుల బ్యాచ్ పెద్దదే ఉంది కానీ అందరికీ దక్కిన లెన్త్ తక్కువే. మలయాళ నటుడు జయరాంది కొంచెం ఓవర్ అనిపించినా ఆ పాత్ర స్వభావమే అంత కాబట్టి సరుకోవాలి. చాలా చిన్న క్యారెక్టర్స్ కు సైతం వెంకట్ ప్రభు లాంటి నోటెడ్ హీరోస్ ని తీసుకున్నారు.

డైరెక్టర్ అండ్ టీమ్

కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ తమిళనాట ఒక అద్భుత గ్రంథం. వందల సంవత్సరాల క్రితం చోళ సామ్రాజ్యంలో ఏర్పడిన ముసలం, అప్పటి రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలతో ఆద్యంతం చదివే వాళ్లకు గూస్ బంప్స్ ఇచ్చే స్థాయిలో సాగుతుంది. ఇలాంటి సబ్జెక్టుని తెరకెక్కించాలనుకోవడం మంచి ఆలోచన. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ చెప్పినట్టు దీన్ని ఎందరో ట్రై చేయాలని చూసి చేతకాక వదిలేశారు. ఎంజిఆర్ తో మొదలుపెట్టి విజయ్ మహేష్ ల దాకా మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయింది. అయినా మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు ఇంత లేట్ వయసులో ఇలాంటి రిస్కీ అడ్వెంచర్ కి సిద్ధపడినందుకు అభినందించాల్సిందే.

ఆలోచన ఎంత గొప్పదైనా సరే అంతే మోతాదులో ఆచరణ కూడా ఉండాలి. పొన్నియన్ సెల్వన్ లో మిస్ అయ్యింది ఇదే. చిరంజీవి వాయిస్ ఓవర్ చూచాయగా నేపథ్యం వివరించాక నేరుగా కథలోకి వెళ్లిపోవడం బాగానే ఉంది కానీ క్యారెక్టర్లను ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి బదులు ఏ మాత్రం ప్రభావం చూపించలేని సీన్లను అల్లుకుంటూ దాన్ని బట్టే పాత్రల మధ్య సంబంధాలను అర్థం చేసుకోమని వదిలేయడం బోలెడంత కన్ఫ్యూజన్ కి చోటిచ్చింది. చాలాసేపటికి కానీ విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ ల మధ్య కనెక్షన్ ఏంటో అంతుచిక్కదు. అసలు లీడ్ క్యాస్టింగ్ మధ్య బంధం ఏంటో చెప్పనప్పుడు ఆడియన్స్ ఎమోషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.

ఇందులో జరిగింది అదే. సహజంగా చెప్పాలనే ఉద్దేశంతో మణిరత్నం డ్రామా పాటర్న్ ని ఎంచుకోలేదు కానీ అదే పెద్ద మైనస్ అయ్యింది. చెబుతున్నది ఇతిహాసమైనా పురాణగాథ అయినా ప్రాపర్ టెంపోతో సాగే నాటకీయత ఉండాల్సిందే. ఇది ఉన్నందుకే టీవీ సీరియల్స్, సినిమాలుగా వచ్చిన రామాయణ భారతాలు గొప్ప ఆదరణ పొందాయి. మణి అంత గొప్ప దర్శకులు ఈ ప్రాథమిక సూత్రాన్ని తేలిగ్గా తీసుకోవడంతో సగటు ప్రేక్షకుడికి తెరమీద జరుగుతున్నది ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగించక ఏదో డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలిగిస్తుంది. ఇంటర్వల్ సైతం ఏదో చిన్న ట్విస్టుతో సరేననిపించారు తప్ప అక్కడ హై మూమెంట్స్ ఉండవు.

బాహుబలితో ఈ మూవీని పోల్చడం అర్ధరహితం. అది ఫాంటసీ. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ బోలెడంత క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు కానీ ఈ పీఎస్ 1కి అలాంటి అవకాశం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కాకపోతే సినిమాటిక్ స్క్రీన్ ప్లేని జోడించాలి. చివరి అరగంట మణిరత్నం టీమ్ ఆ పనిని కొంత మేర చేయగలిగింది కానీ ముందు నుంచే ఆ జాగ్రత్త వహించి ఉంటే ఇండియన్ సినిమాలో ఒక ఎపిక్ గా నిలిచే ఛాన్స్ దక్కేది. ఆలా అని అసలు బాలేదని కాదు. అంచనాలు పెంచేసి, పొగడ్తలతో ఊరించేసి, మాటలలో మరిపించేసి థియేటర్ కు రప్పించినప్పుడు కేవలం ఓపికతో చూడండని చెబితే సరిపోదుగా. ఇదేం సెంటిమెంట్ మూవీ కాదు.

ఇదంతా కాసేపు పక్కనపెడితే మణిరత్నంలో మునుపటి మెజీషియన్ ఇంకా ఉన్నాడు. కాకపోతే పూర్తి స్థాయిలో బయటికి వచ్చి ఇప్పటి తరానికి తగ్గట్టు తనను తాను మార్చుకునేందుకు మొహమాటపడుతున్నాడు. అంత గొప్ప దిగ్దర్శకుడిని కామెంట్ చేసే స్థాయి అర్హత మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ టికెట్ కొని లోపలి వచ్చిన వాడికి ఆయన రేంజ్ అనవసరం. డబ్బులు టైం పెట్టినందుకు గిట్టుబాటు అయ్యిందా లేదానేదే ముఖ్యం. అది జరగనప్పుడు ఎవరైనా తనకొకటే. పొన్నియన్ సెల్వన్ కథలోని ఎన్నెన్నో మలుపులున్నాయి. అవేవీ ప్రాపర్ గా రిజిస్టర్ కాలేకపోయాయి. దీంతో అసలు ఔచిత్యం దెబ్బ తిని మాములు చిత్రంగా మిగిలింది.

ఇంకో ముఖ్యమైన విషయం నేటివిటీ సమస్య. పొన్నియన్ సెల్వన్ ఎలా ఉందనేది పక్కనపెడితే ఇది అన్ని భాషల్లో ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నప్పుడు అందరికీ కనెక్ట్ అయ్యేలా కన్వర్ట్ చేసుకోవాల్సింది. సైరా నరసింహారెడ్డికి హిందీ, తమిళంలో తిరస్కారం ఎదురయ్యింది ఇందుకే. ఇప్పుడా సమస్య దీనికీ వచ్చింది. విజువల్ పోయెట్రీని చెప్పాలనుకున్నప్పుడు ప్రేమకథలు ఎంచుకోవాలి. యుద్ధ నేపథ్యంలో సాగే గాథలను కాదు. కాకపోతే చివరి అరగంటలో కార్తీ, జయం రవిలు అడవి నుంచి పారిపావడంతో మొదలుపెట్టి క్లైమాక్స్ షిప్ ఎపిసోడ్ దాకా ఏరెహమాన్ ఫుల్ డ్యూటీ చేయంతో అక్కడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది.

ఇలాంటి పిఎస్ 1లు మనకేం కొత్త కాదు. బొబ్బిలి యుద్ధం, తాండ్ర పాపారాయుడు, విశ్వనాథ నాయకుడులతో మొదలుపెట్టి 90 దశకం దాకా చాలానే వచ్చాయి. వాటిలో సరైన రీతిలో భావోద్వేగాలు, క్లాసు మాసుని ఊగించే అంశాలు ఉండటంతో చరిత్రలో నిలిచిపోయాయి. ఈ పిఎస్ 1 సైతం వాటిసరసన నిలిచేదే కానీ యాక్టర్లు, వాళ్ళ మధ్య సన్నివేశాల మీద పెట్టిన శ్రద్ధ ఇవి పండడానికి కావాల్సిన కథా కథనాల మీద లేకపోవడం నిరాశపరుస్తుంది. తమిళంలో ఇది ఆడొచ్చు. రికార్డులు సృష్టించవచ్చు. కానీ సగటు తెలుగువాడి కోణంలో చూస్తే మాత్రం మణిరత్నం తీశాడన్న గొప్ప ఫీలింగ్ తో మొదలై నిజంగా ఆయనే తీశాడా అని అనుమానం కలిగేలా ముగుస్తుంది

ఏఆర్ రెహమాన్ సంగీతంలో పాటల పరంగా ఎలాంటి మెరుపులు లేవు. విజువల్ గా బాగుండటంతో పర్లేదనిపిస్తాయి కానీ ఆడియో పరంగా బిలో యావరేజ్ ఆల్బమే.సెకండ్ హాఫ్ బిజిఎంలో తన మునుపటి పనితనం చూపించారు. రవి వర్మన్ ఛాయాగ్రహణం మణిరత్నం ఆలోచనలతో పోటీ పడింది కానీ కంటెంట్ లాగే ఇదీ కొంత అయోమయానికి గురవ్వడంతో అక్కడక్కడా బ్యాలన్స్ తప్పింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిడివి ఎందుకు తగ్గించలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. విఎఫ్ఎక్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. లైకా ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గానే ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎప్పటిలాగే రాజీ పడలేదు. ఎటొచ్చి కరెక్ట్ గా వాడుకునే వాళ్ళు దొరకాలి

ప్లస్ గా అనిపించేవి

కార్తీ పాత్ర
భారీతనం
రెహమాన్ బిజిఎం
ఐశ్వర్యరాయ్ త్రిష

మైనస్ గా తోచేవి

స్పష్టత లేని నెరేషన్
పాత్రల తాలూకు అయోమయం
ఫస్ట్ హాఫ్ ల్యాగ్
పాటలు

కంక్లూజన్

మణిరత్నం గొప్ప దర్శకులు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పాతికేళ్ల వయసులో ఒక వ్యక్తి వంద కేజీల బస్తాను అవలీలగా మోసి ఉండొచ్చు. అతను వృద్ధాప్యంలోకి వచ్చాక అంతే బరువుని ఆశించడం తప్పు. పొన్నియన్ సెల్వన్ చూశాక మణిసార్ మీద గౌరవం తగ్గదు కానీ ఇలాంటి విపరీత ఒత్తిడిని అంచనాలను రేకెత్తించే కథలను ఎంచుకుంటే ఫలితాలు మరోలా వచ్చే ప్రమాదాన్ని సూచిస్తాయి. ఓ అమ్మాయికి ఖరీదయిన పట్టుచీర, ఒంటినిండా వజ్రాలు వైడుర్యాలు పొదిగిన నగలు తొడిగితే సరిపోదు. ఆ యువతి మొహంలో నవ్వు కళ ఉన్నప్పుడే చూసేవాళ్లు కంటికి ఇంపుగా అందంగా ఉంటుంది. లేదంటే ఈ పిఎస్ 1లా నీరసంగా అనిపిస్తుంది.

ఒక్క మాటలో – కంటెంట్ వీకెన్

రేటింగ్ : 2.5 / 5