iDreamPost
android-app
ios-app

Police Story : డబ్బింగ్ ఆర్టిస్ట్ ని హీరో చేసిన బ్లాక్ బస్టర్ – Nostalgia

  • Published Nov 20, 2021 | 11:24 AM Updated Updated Nov 20, 2021 | 11:24 AM
Police Story : డబ్బింగ్ ఆర్టిస్ట్ ని హీరో చేసిన బ్లాక్ బస్టర్ – Nostalgia

క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు హీరోలు కావడం చాలా చూశాం. మోహన్ బాబు లాంటి అగ్ర నటులు అలా పైకొచ్చినవారే. కానీ సాయి కుమార్ కథ దానికి భిన్నంగా ఉంటుంది. 80, 90 దశకాల్లో సుమన్, రాజశేఖర్ సినిమాలకు ఈయన గొంతు లేకుండా ఫైనల్ కాపీ బయటికి వచ్చేది కాదు. నిజంగా వాళ్ళే మాట్లాడుతున్నారా అన్నంత సహజంగా అతకడం వల్లే ఆ ఇద్దరి స్టార్ డంలో సాయి కుమార్ కీ పాత్ర ఉందని అభిమానులు చెప్పుకునేవారు. రజినీకాంత్ బాషా, పెదరాయుడులను సాయి గొంతు లేకుండా ఊహించుకోవడం కష్టం. గొంతుతో ఇంతగా పేరు తెచ్చుకున్న ఈ డబ్బింగ్ మాస్టర్ లో చాలా మంచి నటుడు ఉన్నాడు. చిరంజీవి ఛాలెంజ్, జయసుధ కలికాలం లాంటి ఎన్నో చిత్రాల్లో గొప్ప పాత్రలు పోషించి అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు.

తనలో హీరో కూడా ఉన్నాడని గుర్తించింది మాత్రం కన్నడ పరిశ్రమే. 1994లో దేవరాజ్ హీరోగా రూపొందిన లాకప్ డెత్ సాయి కుమార్ కు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ టైంలో దర్శకత్వం చేసే ప్రయత్నాల్లో ఉన్న ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు రచయిత ఎస్ఎస్ డేవిడ్ ఇచ్చిన కథకు తగిన కథానాయకుడి కోసం వెతుకుతున్నారు. ఇమేజ్, పెర్ఫార్మన్స్ మాత్రమే కాదు అంతకు మించి ఫైర్ ఉన్న నటుడి కోసం చూస్తున్న టైంలో సాయి కుమార్ ని ట్రై చేద్దామని చేసిన స్క్రీన్ టెస్ట్ తాలూకు అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. అంతే ఇక మరో ఆలోచన చేయకుండా వెంటనే పోలీస్ స్టోరీకి శ్రీకారం చుట్టారు. దీనికి స్క్రీన్ ప్లే కూడా థ్రిల్లర్ మంజ్జునే సమకూర్చారు.

నిలువెల్లా ఆవేశం నిండిపోయి ఎక్కడ అన్యాయం జరిగినా ముందు వెనుకా చూడకుండా దాని మీద తిరగబడే అగ్ని ఐపిఎస్ పాత్రలో సాయి కుమార్ విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా మినిస్టర్లకు క్లాసు పీకే సీన్లో, విలన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్ లో మాములుగా జీవించలేదు. కర్ణాటకలో 1996 ఆగస్ట్ 16న విడుదలైన పోలీస్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. సాయి నటనకు జనం వెర్రెత్తిపోయారు. ఫలితంగా యాభై రోజులకు పైగా హౌస్ ఫుల్ బోర్డులు. ఇదే టైటిల్ తో తెలుగులో ఆ ఏడాదే డిసెంబర్ 19న రిలీజ్ చేస్తే ఇక్కడా అదే రిజల్ట్. విలన్ గా చేసిన సత్యప్రకాష్ ఓవర్ నైట్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఇక దాంతో మొదలు సాయికుమార్ ఎన్ని ఖాకీ దుస్తుల సినిమాల్లో నటించారంటే లెక్కబెట్టడం కష్టం. అంతగా పోలీస్ స్టోరీ ప్రభావం ఆయన కెరీర్ మీద ఇప్పటికీ ఉండిపోయింది

Also Read : Horror Thriller : 3 భాషల్లో 300 రోజులు ఆడిన సినిమా – Nostalgia