iDreamPost
android-app
ios-app

నాలుగో సింహం నలుదిక్కులు చూడాలి

నాలుగో సింహం నలుదిక్కులు చూడాలి

సాధారణంగా క్షేత్రస్థాయి పోలీసులు దూకుడుగా ఉంటారు. తమ మాటలతో, చేతలతో గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ఇలా చేయకపోతే ప్రజలకు తామంటే భయం ఉండదని, క్రమశిక్షణ తప్పుతారని భావిస్తుంటారు. ఇది కొంత వరకు నిజం అయినా గతం. కాలంతోపాటు ప్రజానీకం మారింది. చట్టాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. మీడియా కన్నా సోషల్‌ మీడియా బలంగా ఉంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రవర్తిస్తామంటే పోలీసులుకు చిక్కులు తప్పవు. గతంలో వారు చేసేవి బయటకు తెలిసేవి కావు. ఘటన సమయంలో ఉన్న వారికి తప్పా. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది. దానికి ఇంటర్‌ నెట్‌ సౌకర్యం ఉంది. ఫేస్‌బుక్, వాట్స్‌అప్‌ తదితర సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. ఫోన్‌తో పోలీసులు వ్యవహరశైలిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. నిమిషాల్లో ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. నాలుగో సింహాలు చిక్కుల్లో పడుతున్నాయి. వీడియో తీసినట్లు కూడా ఆ సమయంలో పోలీసులకు తెలియదంటే ప్రజా మీడియా ఏ స్థాయిలో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మొన్న చీరాలలో మాస్క్‌ పెట్టుకోలేదని ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడని, అందుకే అతను చనిపోయాడనే ఆరోపణలతో స్టేషన్‌ అధికారి సస్పెండ్‌ అయ్యారు. నిన్న సీతానగరంలో ఇరు వర్గాల మధ్య గోడవలో ఓ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి గుండు చేయించిన ఘటనలో సదరు యువ ఎస్‌ఐ సస్పెండ్‌ కావడంతోపాటు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని బూటు కాలితో తన్నిన సీఐ వ్యవహారం రాష్ట్య్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనలో సీఐ సస్పెండ్‌కు గురయ్యారు.

పైన ఉదహరించిన మూడు ఘటనల్లో బాధితులు దళితులు కావడం యాదృశ్ఛికం. తమ విధులను నిర్వర్తించే క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తున్న నాలుగో సింహాలు ఆ క్రమంలో తిరిగి తామే చిక్కుల్లో పడుతున్నారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ వేయాల్సిన వారిపైనే తిరిగి ఎఫ్‌ఐఆర్‌ పడుతోంది. పైగా ప్రభుత్వానికి తలనొప్పులు మొదలవుతున్నాయి. ఖాకీలు వ్యవహారానికి ప్రభుత్వ జవాబు చెప్పుకోవాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు రాజకీయం, ఓట్ల కోణంలో ఆయా అంశాలపై రచ్చ చేస్తున్నాయి.

ఫ్రెండ్లీ పోలిసింగ్‌ అంటూ పోలీసు శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టినా.. కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు వస్తోంది. కాలంతోపాటు తాము మారాలన్న విషయం నాలుగో సింహాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీడియాలో వస్తే.. ఇబ్బందులు ఉంటాయనే భావనలో మీడియాతో జాగ్రత్తగా ఉండేవారు. అయితే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. తాము దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో చుట్టుపక్కల పరిస్థితులును నాలుగో సింహాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తే.. గతంలో మాదిరిగా ప్రభుత్వాలు చూస్తు ఊరుకోవడం లేదు. వెంటనే చర్యలు చేపడుతున్నాయన్న విషయం తెలుసుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. లేదంటే తాను పని చేసిన స్టేషన్‌లో తనపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతుంది. అంతా మేము చూసుకుంటాం.. అనే స్థానిక ప్రజా ప్రతినిధుల మాటలు విని విధులు నిర్వహించకపోవడం ఎంతో ఉత్తమం.