iDreamPost
android-app
ios-app

“తలకు తల పోవాలి.. లేకపోతే అందర్నీ చంపేస్తాం” – భయంతో కుటుంబ సభ్యుడ్నే హతమార్చిన వైనం

  • Published Jun 02, 2022 | 10:01 AM Updated Updated Jun 02, 2022 | 10:01 AM
“తలకు తల పోవాలి.. లేకపోతే అందర్నీ చంపేస్తాం” – భయంతో కుటుంబ సభ్యుడ్నే హతమార్చిన వైనం

“మా నాన్న చావుకు కారణమైన మీ వాడు కూడా అలానే చావాలి. తలకు తల పోవాలి. లేదంటే కుటుంబ సభ్యులందర్నీ చంపేస్తాం”.. అన్న మాటలకు భయపడిన ఓ కుటుంబం.. తమ కుటుంబంలో మతిస్థిమితం లేని వ్యక్తిని దారుణంగా హతమార్చింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో జరిగిందీ వింత ఘటన. సీతంపేట మండలం రేగులగూడలో మే 27న జరిగిన పెళ్లిలో గ్రామానికి చెందిన సవర గయా (60) కుమార్తె పద్మను ఉసిరిపాడుకు చెందిన మతిస్థిమితం లేని సవర సింగన్న (33) కర్రతో కొట్టాడు.

దాంతో గయా సింగన్నను కిందకు తోసేశాడు. కోపంతో సింగన్న పెద్దకర్రతో గయాపై దాడి చేయగా.. గయా అక్కడికక్కడే మృతి చెందాడు. మరుసటిరోజు గయా కుమారులు, స్థానికులు సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారంతా వచ్చాక పంచాయతీ నిర్వహించారు. తమ తండ్రిని చంపినవాడు కూడా.. అలానే చావాలని గయా కుమారులు పంచాయతీ పెద్దల ముందు చెప్పారు. అలా జరగని పక్షంలో సింగన్న కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామని బెదిరించారు. దాంతో పంచాయతీ.. “తలకు తల” అని తీర్మానించింది.

పంచాయతీ పెద్దల తీర్మానం మేరకు మే 28న సింగన్నకు విషమిచ్చారు. అయినా మరణించకపోవడంతో ఉరివేశారు. ఆపై ఎవరికీ తెలియకుండా దహనం చేశారు. ఇదంతా తెలియని వారు సాధారణ మరణాలనుకున్నారు. కానీ.. రెవెన్యూ సిబ్బంది, గ్రామ వాలంటీర్ల ద్వారా అసలు విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రెండ్రోజుల్లో రెండు హత్యల మిస్టరీని చేధించి.. హత్యకు కారకులు, ప్రేరేపించినవారిని, పంచాయతీ పెద్దలు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశారు.