iDreamPost
android-app
ios-app

మంత్రి పేర్నిపై హత్యాయత్నం : మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు

మంత్రి పేర్నిపై హత్యాయత్నం : మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు

మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు హత్య కేసులో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు కొత్త చిక్కుల్లో పడ్డారు. కరోనా వైరస్‌ పేరుతో బెయిల్‌ పొంది జైలు నుంచి వచ్చిన కొల్లు రవీంద్ర.. తాజాగా మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యయత్నం ఘటనపై చేసిన వ్యాఖ్యలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఇటీవల పేర్ని నానిపై మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద ఓ వ్యక్తి తాపితో దాడి చేయబోయాడు. మంత్రి అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

తాపితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కోసం మూడు ప్రత్యేక బృందాలను కృష్ణా ఎస్పీ ఏర్పాటు చేశారు. అయితే ఇసుక దొరక్క పని లభించలేదనే అక్కసుతో అతను మంత్రిపై తాపితో దాడి చేసి ఉంటాడని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. హత్యాయత్నం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. కొల్లు రవీంద్ర వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు. కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. నిందితుడు అదే కారణంతోనే దాడి చేశాడనేందుకు ఆధారాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మరో వైపు నిందితుడు నాగేశ్వరరావును కోర్టు అనుమతితో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు పోలీసులు నాగేశ్వరరావును విచారించనున్నారు. ఇప్పటికే నిందితుడి నాగేశ్వరరావు కాల్‌ లిస్ట్‌పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అతన్ని నేరుగా విచారించడం వల్ల మరింత దాడికి సంబంధించి మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. కాగా, మంత్రి నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. ప్రధాన ద్వారం వద్ద మెటల్‌ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు. క్షుణ్నంగా తనికీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.