Idream media
Idream media
ఎదుటి వారికి చెప్పే ముందు మనం ఆరచిస్తే సగం సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తిరుపతి అర్బన్ ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ నమ్ముతారు. మరీ ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించే విషయంలో జరిమానాలతో అవగాహన కల్సించలేమని, పోలీసులు ఆచరిస్తే అందరూ పాటిస్తారని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రతి పోలీసు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశారు. ఎస్పీ ఆదేశాలు సోమవారం నుంచి తూ.చ తప్పక ఆచరించాలని అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇంత వరకూ హెల్మెట్ల వాడకంపై అవగాహన మొక్కుబడిగా సాగుతూ వస్తోంది. హెల్మెట్ ధరించని వాహనదారుడికి జరిమానా విధించడంతో తమ బాధ్యత నెరవేరినట్టు పోలీసులు భావిస్తూ వచ్చారు. తాము చట్టానికి, న్యాయానికి, నిబంధనలకు అతీతమని వారి విశ్వాసం. అయితే ప్రాణాలు ఎవరివైనా ఒకటేనని, హెల్మెట్ ధరించకపోతే పోలీసుల ప్రాణాలకు మాత్రం రక్షణ ఎలా ఉంటుందనేది తిరుపతి అర్బన్ ఎస్పీ లాజిక్.
ఆ లాజిక్ నుంచే పుట్టిన ఆలోచన, ఆశయమే ఓ మంచి పరిణామానికి దారి తీసింది. ముందుగా పోలీసులంతా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, ఆ తర్వాత ప్రజలకు చెప్పాలన్నారు. సిబ్బంది ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌దే బాధ్యత అని తేల్చి చెప్పారు. దీంతో తమ సిబ్బంది హెల్మెట్లు ధరించేలా చేసే బాధ్యతను స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ తీసుకున్నారు. అంతేకాకుండా వాహనదారులంతా హెల్మెట్లు ధరించాలని ట్రాఫిక్ పోలీసులు తిరుపతిలో సోమవారం నుంచి విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేపట్టనున్నారు.