iDreamPost
iDreamPost
వివాదాస్పద హామీలు, వ్యాఖ్యలతో గత కొన్నాళ్లుగా నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అయితే అది నేరుగా కాకుండా అల్లుడి వల్ల తలెత్తిన వివాదం. కొవ్వూరుకు చెందిన ఓ కుటుంబ ఆస్తిని చీటింగ్ చేసి ఫోర్జరీ సంతకాలతో రూ. 15 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నారంటూ వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహంపై ఫిర్యాదు దాఖలైంది.. కేసు కూడా నమోదైంది. నరసింహం అందుబాటులో లేకపోవడంతో బాధితుల ఫిర్యాదులోని అంశాలు తప్ప పూర్తి వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. సోము వీర్రాజుకు దీంట్లో ప్రమేయం లేకపోయినా.. రాజకీయంగా ఆయన్ను ఇరకాటంలోకి నెట్టే అవకాశం మాత్రం ఉంది.
బ్యాంకులో తనఖా.. రూ.15 కోట్ల రుణం
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టౌన్ పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. కొవ్వూరుకు చెందిన గద్దె జయరామకృష్ణ, శ్రీవాణి దంపతులకు కొంత ఆస్తి ఉంది. 2018-2020 సంవత్సరాల మధ్య కవల వెంకట నరసింహం ఈ ఆస్తిని కొవ్వూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫోర్జరీ సంతకాలతో తనఖా పెట్టి రూ. 15 కోట్ల రుణం తీసుకున్నారు. చాలా కాలంగా ఢిల్లీలో ఉన్న జయరామకృష్ణకు ఈ విషయం తెలియదు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ ఇటీవల ఆయనకు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. అప్పుడు అసలు విషయం తెలిసింది. తమను నరసింహమే చీటింగ్ చేశారని ఆరోపిస్తూ మంగళవారం జయరామకృష్ణ కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహం పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అందుబాటులోకి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నారు.
కావాలనే కేసు పెట్టారా?
సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన కొత్తలో కొంత హడావుడి చేసినా.. తర్వాత కాస్త డౌన్ అయ్యారు. మళ్లీ కొద్దిరోజులుగా వార్తల్లో నలుగుతున్నారు. వివాదాలకు కేంద్రంగా మారారు. ప్రజాగ్రహ సభలో చీప్ లిక్కర్ హామీ ఇచ్చి అభాసుపాలయ్యారు. ఆ వెంటనే జిన్నా టవర్ పేరు మార్చాలని.. లేదంటే పేల్చివేస్తామని మరో వివాదం రేపారు. విశాఖ కేజీహెచ్ పేరు కూడా మార్చాలన్నారు. ఇలా ఆయన చేసిన వరుస ప్రకటనలు పెను వివాదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన విపరీతంగా ట్రోలింగ్స్ కు గురయ్యారు. చీప్ లిక్కర్ హామీపై మహిళల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇవన్నీ రాజకీయాంశాలు. తాజాగా అల్లుడిపై నమోదైన చీటింగ్,ఫోర్జరీ కేసుతో సంబంధం లేకపోయినా.. చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. ఇదంతా కొందరు కావాలని పన్నిన కుట్ర అని.. సోము వీర్రాజు సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
Also Read : నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ