iDreamPost
android-app
ios-app

మోడీ హైదరాబాద్ పర్యటనతో గ్రేటర్ ఓటర్లను ఆకర్షించేనా..?

మోడీ హైదరాబాద్ పర్యటనతో గ్రేటర్ ఓటర్లను ఆకర్షించేనా..?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం క్సైమాక్స్ చేరింది. అధికార, ప్రతిపక్షాలు ఆఖరి అస్త్రాలకు పదునుపెడుతున్నాయి. అధికార పార్టీ తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెడితే, ప్రధాని మోదీ అధికారిక పర్యటనను బీజేపీ పరోక్షంగా క్యాష్ చేసుకుంటోంది. ప్రధాని ఆకస్మిక పర్యటన వెనక బీజేపీ ఎన్నికల వ్యూహం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. మోదీ పర్యటనలో ముఖ్యమంత్రి లేకుండా జాగ్రత్తపడడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు విచ్చేసినప్పుడు రాష్ట్రం తరుపున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. కానీ మోదీ నగర పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రావల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి కార్యాలయం సూచించింది. దీంతో ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. హకీం పేట విమానాశ్రయం నుంచి భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్లిన ఆయన కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా బీజేపీని ప్రమోట్ చేయడం కోసమే మోదీ హైదరాబాద్ ని సందర్శించారని అధికార పార్టీ విమర్శస్తుండగా, ఎన్నికలకు, ప్రధాని పర్యటనకూ ఎలాంటి సబంధం లేదని బీజేపీ వాదిస్తోంది. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి సహా స్థానిక ప్రజా ప్రతినిధులెవ్వరికీ పాల్గొనే అవకాశం లభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో తనకు ఆహ్వానం లేదంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తి చేశారు. ఇది ప్రధాని వ్యక్తిగత పర్యటనో, బీజేపీ సొంత కార్యక్రమమో కానప్పుడు స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు? మోదీ అధికార పర్యటనలో ముఖ్యమంత్రికి పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ శ్రేణులు సైతం తీవ్రంగా స్పందించాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా వర్ణించాయి.

బీజేపీ మాత్రం ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ఎలాంటి వివాదం లేదంటోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి రాజకీయ చర్చకు అవకాశం ఇవ్వద్దనే ప్రధాని ఎవరినీ కలవలేదని వాదిస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి టీఆర్ఎస్ పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ కు రావాలా అని ప్రశ్నిస్తోంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధిని పరిశీలనకే మోదీ పర్యటన పరిమితమైనప్పటికీ అది బీజేపీకి అనుకూలించే విషయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా ఉండడమే అందుకు కారణం. బీహార్ ఎన్నికల్లో కూడా బీజేపీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి విస్తృతంగా ప్రచారంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. గ్రేటర్ పీఠంపై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రధాని పర్యటన ఎంతమేరకు కలిసొస్తుందో చూడాలి మరి.