Idream media
Idream media
పెట్రో ధరల పెంపు గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడి తేనే తుట్టెను కదిపినట్లయ్యింది. ఇవాళ సీఎంలతో మోడీ వర్చువల్ మీట్ చేశారు. ఆ సందర్భంగానే పెట్రో ధరల గురించి మాట్లాడారు. దీంతో ఆయన ప్రస్తావించిన రాష్ట్రాలు స్పందించాయి. కర్ణాటక, గుజరాత్ వ్యాట్ తగ్గించాయని మోడీ గుర్తుచేశారు. దీంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ టాక్స్ తగ్గించడం లేదని ఆరోపించారు. అందుకే ధర తగ్గడం లేదని చెప్పారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెరిగి, సహకరించు కోవడం ఆవశ్యకం అని మోడీ పేర్కొన్నారు. తన అపజయాన్ని తమకు రుద్దుతున్నారని ఆయా రాష్ట్రాలు ఒంటికాలిపై లేచాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒకలా.. మిగతా రాష్ట్రాలను సవతి కొడుకులా చూస్తున్నారని మండిపడ్డారు. తన తప్పులను రాష్ట్రాలపై రుద్దడం ఏంటి అని అడిగారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏకిపారేశారు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం వ్యాట్ పెంచలేదని చెప్పారు. తమకు రావాల్సిన 41 శాతం వాటా రావడంలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సెస్సు తగ్గించాలని.. దీంతో పెట్రోల్ రూ.70, డీజిల్ రూ.60కి ఇస్తామని చెప్పారు.
ఇది ముమ్మాటికీ పొలిటికల్ ఎజెండా అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోవిడ్ సమావేశంలో మిగతా అంశాలను ప్రస్తావించడం ఏంటి అని అడిగారు. తాము ట్యాక్స్ తగ్గిస్తే.. ఆయన పన్నులు తీసుకెళతారా అని అడిగారు. పెట్రోల్‌పై రూ.1 తగ్గించామని.. మూడేళ్లుగా ఇలా చేయడంతో తమపై రూ.1500 కోట్ల భారం పడిందని చెప్పారు. కానీ వాటిని ప్రధాని మోడీ చెప్పరని పేర్కొన్నారు.
సెస్ వల్లే పెట్రో ధర ఆకాశాన్ని అంటుతుందని డీఎంకే కూడా ఆరోపించింది. సెస్ వేసేది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. సెస్ వసూల్ చేయొద్దని.. వ్యాట్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరతామని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ తెలిపారు. ఇప్పటికే రూ.3 తగ్గించామని చెప్పారు. వ్యాట్ ధరను అన్నాడీఎంకే సెట్ చేసిందని తెలిపారు. పెట్రో ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత వహించబోదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం సిటిజెన్ ట్యాక్స్ రిలీఫ్ అందిస్తోందని తెలిపారు. మొత్తం మీద పెట్రోల్ ధర పెంపునకు కారణం ఎవరు అనే చర్చకు తెరలేచింది. పెట్రో రాజకీయం ఎలా సాగుతుందో చూడాలి.