Dharani
Dharani
రాజ్యం అయినా ప్రజాస్వామ్య దేశమైనా సరే.. బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం ప్రత్యేక చట్టాలు, రాయితీలు అమలు చేస్తాయి. ఇక్కడ బలహీనం అంటే ఆర్థిక, సామాజికంగా అని మాత్రమే కాదు.. శారీరకంగా కూడా. పురుషులు, మహిళలు అన్న విషయానికి వస్తే సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా శారీరకంగా బలహీనులైన ఆడవారి పట్లే కాస్త ఎక్కువ సానుభూతి చూపుతాయి. వారి రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకు వచ్చాయి. అయితే ఎన్ని చట్టాలు వచ్చినా.. సమాజంలో మహిళలకు భద్రత కరువయ్యింది అన్నది ఎంత నిజమో.. ఈ చట్టాలను వాడుకుని కొందరు కిలేడీలు.. మగాళ్లను ఇబ్బంది పెడుతున్నారనేది అంతే వాస్తవం.
నేటి సమాజంలో వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో పురుషులు కూడా ఉంటున్నారు. స్వతహాగా ఉండే పురుషాధిక్యత, నలుగురికి తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో.. చాలా మంది ఇలాంటి వేధింపులను సైలెంట్‌గా భరిస్తారు. కాదంటే.. ఎక్కడ తమ మీద తప్పుడు కేసులు పెడతారనే భయంతో.. జరిగే వేధింపుల గురించి వెల్లడించరు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. వేధింపులు ఎదుర్కొంటున్న మగవారు.. బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
దేశంలో మహిళల సమస్యలను పరిష్కరించడానికి.. వారికి అండగా, మద్దతుగా నిలవడానికి దేశం, రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు ఉన్నాయి. తాజాగా ఓ కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. మహిళల మాదిరిగానే తమకు పురుష కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలంటూ.. కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ వివరాలు.. దేశంలో పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్(ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. కేవలం మహిళలు, బాలికలు, యువతులు మాత్రమే కాక.. వివాహం అయిన పురుషులు కూడా గృహహింసకు గురవుతూ, కుటుంబసమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిల్‌లో వెల్లడించారు. ఈ క్రమంలో మగాళ్లు తమ బాధ, ఇబ్బందులు చెప్పుకుని న్యాయం పొందేందుకు వీలుగా ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ను ఏర్పాటు చేయాలని పిల్‌లో కోరారు.
ఈ పిటిషన్‌ను మహేశ్‌కుమార్ తివారీ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఎంతోమంది పెళ్లైన పురుషులు గృహహింస భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆ సమస్యపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిత పాటు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-2021 రిపోర్టును కూడా పిటిషన్‌కు జత చేశారు పిటిషనర్ మహేశ్‌కుమార్. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిలో 1,18,979 మంది పురుషులు కాగా.. 45,026 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అందులో.. 81,0 63 మంది పెండ్లి అయిన పురుషులు కాగా.. 28,680 మంది వివాహిత మహిళలని తాము దాఖలు చేసిన పిటిషన్‌లో వివరించారు.
ఈ రిపోర్ట్‌లోని వివరాల ప్రకారం 2021లో 33.2 శాతం మంది పురుషులు కుటుంబ సమస్యల కారణంగా.. 4.8 శాతం మంది పురుషులు వివాహ సంబంధిత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు.. గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల సంఘం తగు సూచనలు చేయాలన్నారు. జాతీయ పురుషుల కమిషన్‌ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఇక.. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇద్దరు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ విచారించనుంది. మరి దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.