iDreamPost
android-app
ios-app

పంది గుండె అమర్చిన తొలి వ్యక్తి మృతి

పంది గుండె అమర్చిన తొలి వ్యక్తి మృతి

పంది గుండెను మనిషికి అమర్చి అమెరికా వైద్యులు చేసిన తొలి ప్రయోగం గుర్తుందా! రెండు నెలల క్రితం యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు చేసిన ఈ ప్రయోగం వికటించింది. గుండె మార్పిడి జరిగిన రెండు నెలల తర్వాత.. అంటే.. మంగళవారం ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని వైద్యులు బుధవారం వెల్లడించారు. అతడి మరణానికి కారణాన్ని చెప్పని వైద్యులు.. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడని మాత్రమే తెలిపారు.

మేరీల్యాండ్‌కు చెందిన డేవిడ్‌ బెన్నెట్‌ (57)కు ఈ ఏడాది జనవరి 7న యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు ప్రయోగాత్మకంగా పంది గుండెను అమర్చారు. తొలినాళ్లలో గుండె పనితీరు బాగుండడంతో.. ఇక ఏ సమస్యా రాదని భావించి డిశ్చార్జి చేశారు. కొద్దిరోజులు అంతా బాగానే ఉన్నా.. ఇటీవల బెన్నెట్‌ అస్వస్థతకు గురయ్యారు. మేరీల్యాండ్‌ ఆస్పత్రి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా.. ఫలితం లేకపోయింది. కాగా, ఈ ఘటనపై స్పందించిన బెన్నెట్‌ కుమారుడు.. వైద్యుల పనితీరును అభినందించారు. ‘‘పంది గుండెను అమర్చకుండా ఉంటే.. నా తండ్రి ఎప్పుడో మరణించే వారు. వైద్యులు చేసిన ప్రయోగం వల్ల రెండు నెలలు అదనంగా జీవించారు. ఈ ప్రయోగం.. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలవాలి’’ అని ఆకాంక్షించారు.