Dharani
ప్రాణపదంగా పెంచుకున్న బిడ్డ కడసారి చూపు కోసం ఓ తండ్రి.. మనసు చంపుకుని చేయి చాచి సాయం కోరుతున్నాడు. ఆ వివరాలు..
ప్రాణపదంగా పెంచుకున్న బిడ్డ కడసారి చూపు కోసం ఓ తండ్రి.. మనసు చంపుకుని చేయి చాచి సాయం కోరుతున్నాడు. ఆ వివరాలు..
Dharani
అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా.. తల్లిదండ్రులు విలవిల్లాడతారు. ఆ కష్టం తొలగిపోయే వరకు.. కన్నవాళ్లకు కంటి మీద కునుకుండదు. బిడ్డలు అనారోగ్యం పాలైతే.. అప్పు చేసైనా సరే.. వారికి మంచి చికిత్స అందించేందుకు తాపత్రయ పడతారు. ఆస్తులు అమ్మి.. అప్పు చేసైనాసరే.. బిడ్డలను బతికించుకోవాలని భావిస్తారు. కానీ దురదృష్టవశాత్తు వారి ప్రయత్నాలు విఫలం అయితే.. కన్న వారికి తీరని కడుపుకోత మిగులుతుంది. వారు బతికున్నంత కాలం చనిపోయిన బిడ్డల కోసం ఏడుస్తూనే ఉంటారు. ఇక కొందరికి మరీ విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాణంగా పెంచుకున్న బిడ్డ ప్రాణాలు పోయినా సరే.. కొందరు మానవత్వం మరిచి.. డబ్బుల కోసం ఆ తల్లిండ్రులను వేధింపులకు గురి చేస్తారు. తాజాగా ఓ తండ్రికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. కళ్లలో పెట్టి చూసుకున్న బిడ్డ కన్ను మూసింది. తన ఆఖరి చూపు కోసం.. దాతల సాయం కోరుతున్నాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన.. చెన్నైలో చోటు చేసుకుంది. అనంతరం జిల్లాకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఒకరు.. అనారోగ్యంతో బాధపడుతూ.. మెరుగైన వైద్యం కోసం చెన్నై వెళ్లారు. చికిత్సకు భారీగా ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ యువతి మృతి చెందింది. ఇక డెడ్‌బాడీని అప్పగించాలంటే.. ఆస్పత్రి బిల్లు చెల్లించాలని హస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే కుమార్తె చికిత్స కోసం భారీగా ఖర్చు చేసిన ఆ పేద తండ్రి బిడ్డ కడసారి చూపు కోసం.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం దాతల సాయాన్ని కోరుతున్నాడు. గుండెలు పగిలే బాధను పంటి బిగువున దాచి.. మనసు చంపుకుని.. చేయి చాయి అర్ధిస్తున్నాడు.
అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నగదాని మాధురి అనే యువతి ఐటీ ఉద్యోగిని. గత కొన్నాళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చూపించినా లాభం లేకపోయింది. దాంతో మెరుగైన వైద్యం కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు మాధురిని పరీక్షించి.. ఆమెకు క్షయ ఉందని తెలిపి.. ఆ మేరకు చికిత్స చేశారు. కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మాధురి ఇంటికి వెళ్లింది.
కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ అనారోగ్యం పాలయ్యింది. దాంతో పోరూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు. ఆమెను పరీక్షించిన వైద్యులు మాధురి మూత్రపిండాలు, కాలేయంలో ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉందని.. క్షయ కూడా బాగా ముదిరిందని గుర్తించారు. వెంటనే ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. వైద్యం కోసం సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అంత మొత్తం భరించడం మాధురి తల్లిదండ్రులకు తలకు మించిన భారం. అయినా సరే.. బంధువుల దగ్గర ఒక 6 లక్షల రూపాయలు, ఆరోగ్య బీమా ద్వారా 5 లక్షల సమకూర్చారు. దాతల సాయం కోసం అర్థిచగా.. 60 వేల వరకు మాత్రమే సమకూరాయి.
చికిత్స చేసినప్పటికి.. మాధురి శరీరం అందుకు సహకరించకపోవడంతో బుధవారం ఉదయం ఆమె చనిపోయింది. ఈ క్రమంలో మిగతా 7.50 లక్షల రూపాయలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఓవైపు బిడ్డ మరణం.. మరోవైపు ఆస్పత్రి వేధింపుల మధ్య ఆ తల్లిదండ్రుల బాధ వర్ణానాతీతంగా మారింది. కన్నబిడ్డకు అంత్యక్రియలు చేసుకోవాలంటే.. లక్షలు చెల్లించాల్సి రావడం వారిని ఆవేదనకు గురి చేస్తోంది. తమ పరిస్థితిని అర్థం చేసుకుని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని కోరారు.