iDreamPost
iDreamPost
అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అక్కున చేర్చుకోవాల్సిన నాన్న అనాథలా వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ, తాతయ్యలే ఆ చిన్నారిని కాపాడుకున్నారు. చదివించారు. కట్ చేస్తే ఆ అమ్మాయి CBSE టెన్త్ ఎగ్జామ్స్ లో 99.4 శాతం మార్కులు సాధించింది. గుండెలు కదిలించే ఈ కథ… చదువుల తల్లి శ్రీజది!
పాట్నాకు చెందిన శ్రీజ తల్లి చిన్నప్పుడే జబ్బు చేసి కన్నుమూసింది. ఆ తండ్రి ఆడపిల్ల ఖర్చు తనకెందుకు అనుకున్నాడు. పసిదాన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. చిన్నారి శ్రీజ ఏడుపు విన్న చుట్టుపక్కలవాళ్ళు అమ్మ తరఫు బంధువులకు సమాచారమిచ్చారు. అక్కడకెళ్లిన అమ్మమ్మ, తాతయ్య ఆ చిట్టి తల్లిని తమతో పాటే ఇంటికి తీసుకెళ్ళారు. వయసు సహకరించకపోయినా తనను బాగా చదివించారు. ఇప్పుడా పాప CBSE టెన్త్ పరీక్షలో ఏకంగా 99.4 శాతం మార్కులు సాధించడంతో వాళ్ల సంతోషం అంతా ఇంతా కాదు. ఈ ఫలితం చూస్తే శ్రీజ తండ్రి పశ్చాత్తాపపడ్డం ఖాయం అంటోంది అమ్మమ్మ.
రెండో పెళ్ళి చేసుకున్న శ్రీజ తండ్రి ఒక్కసారి కూడా కూతుర్ని చూడ్డానికి రాలేదు. ఇప్పుడైనా అతనికి కనువిప్పు కలుగుతుందేమో అని ఆవిడ ఆశపడుతోంది. శ్రీజ విజయం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని కదిలించింది. తనకు ఎలాంటి సాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ కూడా శ్రీజపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఎన్నో కష్టనష్టాలలను ఎదుర్కొని ఇంత గొప్ప విజయం సాధించిన శ్రీజకు, ఆమెకు అండగా నిలిచిన అమ్మమ్మ, తాతయ్యలను అభినందిస్తోంది.