బస్సు వేగంగా ప్రయాణిస్తుంది. ఇంతలో దారి మధ్యలో బస్సు ఆపి తనిఖీ అధికారులు బస్ ఎక్కారు. వారిని చూడగానే కండక్టర్ కి చిరు చెమటలు పడుతున్నాయి. ఎవరైనా ప్రయాణికులు టికెట్ లేకుండా దొరికితే నా పరిస్థితి ఏంటి అని. చెకింగ్ కొనసాగింది. ఈలోగా టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు దొరికారు. దీంతో కండక్టర్ చెమటలతో తడిసిపోయాడు. ప్రయాణికులకు ఫైన్ వేసి టికెట్ ఇవ్వని కండక్టరును తనిఖీ అధికారులు సస్పెండ్ చేసారు. కానీ ఇదంతా గతం… ఇప్పుడు టికెట్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదే అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గతంలో ఏ ఒక్క ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోయినా దానికి శిక్ష కండక్టర్ అనుభవించేవారు. విధులలో టిక్కెట్‌లపైన వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి తక్కువగా ఉన్నా కఠిన చర్యలు తీసుకోవడం వేలాది మంది కండక్టర్ల ఉద్యోగభద్రతకు ముప్పుగా పరిణమించింది. ఇప్పటికే ఎంతోమంది కండక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఉద్యోగాలకు దూరమై ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్లు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ కార్మికులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు కండక్టర్లకు ఉపశమనం లభించింది. ఏళ్ల తరబడి కండక్టర్లు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.
మోటార్ వాహనాల చట్టం 178 ప్రకారం టికెట్ తీసుకోవలసిన బాధ్యత పూర్తిగా ప్రయాణికులదే అని ప్రచారం నిర్వహించింది. ఇకపై ఎవరైనా ప్రయాణికుడు టికెట్ తీసుకోని పక్షంలో దానికి శిక్ష కండక్టర్ అనుభవించాల్సిన అవసరం లేదు. దీనితో కండక్టర్లపై నెలకొన్న ఒత్తిడి పూర్తిగా తొలగనుంది. అంతేగాకుండా గతంలో తనిఖీ అధికారులు దారి మధ్యలో ఎక్కడైనా బస్సును ఆపి తనిఖీలు నిర్వహించేవారు. దానివల్ల ప్రయాణికుల సమయం వృథా అవుతుండడంతో ఇకపై ఆన్ రోడ్ తనిఖీలకు స్వస్థి పలుకుతూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.. తనిఖీలను బస్ స్టాపుల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.