iDreamPost
iDreamPost
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవిస్తూ పెత్తనం చేశారు. ఎడాపెడా సంపాదించి బాగానే వెనకేసుకున్నారు. ఆ విషయంలో పార్టీ కార్యకర్తలను సైతం పీడించుకు తిన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. వారి పదవులు కూడా పోయాయి. కానీ గతం మాత్రం వెంటాడుతోంది. సొంత పార్టీ కార్యకర్తలే చీదరించుకుంటున్నారు. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. దాంతో బయట తిరగడానికే మొహంచెల్లని దుస్థితిని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీ నియోజకవర్గంపై పూర్తిగా పట్టు బిగించింది.
వెంటాడుతున్న గతం
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పార్వతీపురం ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన బొబ్బిలి చిరంజీవులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ నాయకుడు ద్వారపురెడ్డి జగదీష్ కు అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు మేలు చేయడం మాని.. సొంత లాభం చూసుకున్నారు. ఎవరికి వారు దండుకోవడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే చిరంజీవులు పనుల కోసం తన వద్దకు వచ్చేవారిని ‘నాకేంటి’ అంటూ నేరుగానే అడిగేసేవారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలకు కూడా మినహాయింపు ఇవ్వలేదు.
మరోవైపు ఎమ్మెల్సీ జగదీష్ సతీమణి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉండేవారు. మున్సిపాలిటీ పనులన్నింటినీ ఆమె జగదీష్ తమ్ముడు, తన మరిది అయిన కాంట్రాక్టరుకే కట్టబెట్టేవారు. దాంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పట్ల ప్రజల్లోనే కాదు.. పార్టీ కార్యకర్తల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగారావును గెలిపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా ఓడిపోయి అధికారం కోల్పోవడంతో ఇద్దరు నేతల పరిస్థితి తిరగబడింది. బయట కూడా తిరగలేక ఎక్కువగా ఇళ్లకు పరిమితం అవుతున్నారు.
దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ
మొహం చెల్లని పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం అయ్యారు. దాంతో నడిపించేవారు లేక నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే జోగారావు వైఎస్సార్సీపీని మరింత పటిష్ట పరుచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే సీతానగరం మండలంలో టీడీపీకి అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారు. అలాగే పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డులకు గాను ఆరు వార్డుల్లో టీడీపీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి కల్పించారు. ఆ ఆరు వార్డులను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు మొత్తం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ ఖాతాలో వేశారు. ఈ పరిణామాలతో పార్వతీపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికైనా టీడీపీ పుంజుకోవడం కష్టమన్న భావన ఆ పార్టీలోనే వ్యక్తం అవుతోంది.