iDreamPost
android-app
ios-app

పల్లెలో కనిపించని పంచాయతీ సందడి.. హడావుడి అంతా నిమ్మగడ్డదే..

పల్లెలో కనిపించని పంచాయతీ సందడి.. హడావుడి అంతా నిమ్మగడ్డదే..

ఎన్నికలంటే చాలు నెల రోజులు ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. అదీ స్థానిక సంస్థల ఎన్నికలంటే.. ఈ హడావుడి ఎలా ఉంటుందో చెప్పనలవి కాదు. గ్రామాల్లో ప్రజల మధ్య ఎన్నికల గురించిన చర్చలే ఉంటాయి. సర్పంచ్, వార్డుల అభ్యర్థులు ఎవరుంటారు..? ఎవరు..? ఎవరికి ఓటేస్తారు..? అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు, సీటు ఆశించే అభ్యర్థుల హడావుడి.. ఇలా ఓ తిరునాళ్ల వాతావరణమే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెల్లో ఆ సందడి కనిపించడం లేదు.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు సింగిల్‌ జడ్జి నిలిపివేయగా, డివిజనల్‌ బెంచ్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టుకు వెళ్లింది. అయితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాత్రం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేశారు. అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సన్నాహాలపై హడావుడి చేస్తున్నారు. నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని నిన్న గురువారం ప్రకటించారు. రేపు శనివారం ఉదయం పది గంటలకు తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇస్తానని కొద్దిసేపటి క్రి తం ప్రకటించారు. నోటిఫికేషన్‌ వివరాలు వెల్లడించేందుకు రేపు ఉదయం పది గంటలకు ప్రెస్‌ మీట్‌ పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ అంశాలను టీడీపీ అనుకూల న్యూస్‌ ఛానెళ్లు ప్రసారం చేస్తూ హడావుడి చేస్తున్నాయి. కానీ గ్రామాల్లోని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు మాత్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోళాహళమే కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయనే అంశాన్నే గ్రామీణ అసలు ప్రజలు పట్టించుకోవడం లేదు.

నోటిఫికేషన్‌ విడుదల చేసిన 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి రెండు, మూడు రోజుల్లోనే నామినేషన్ల దాఖలు చేయాలి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, చర్చలు, సమావేశాలు.. ఇలా పెద్ద తతంగమే ఉంటుంది. కానీ ఇలాంటి సందడి ఏమీ ఆయా పార్టీలలో కనిపించడం లేదు. ఎన్నికలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు కూడా.. ఎన్నికలపై ఎలాంటి కసరత్తులు చేయడం లేదు. ఆ దిశగా సమీక్షలు, కార్యకర్తలకు దిశానిర్ధేశాలు.. ఏమీ కనిపించడం లేదు.

ఏపీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రింలో విచారణ జరగాల్సి ఉంది. తమ వాదనలు కూడా వినాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిగి, సుప్రిం తీర్పు వెలువరించాల్సి ఉంది. సుప్రిం తీర్పు తర్వాతే.. అధికార పార్టీ నేతలు ఎన్నికల గురించి ఆలోచిస్తారు. వారితోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలు దృష్టి పెడతారు. ఎన్నికల సందడి మొదలవుతుంది. అప్పటి వరకూ.. పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హడావుడి మాత్రమే కనిపిస్తుంది.