iDreamPost
iDreamPost
ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు చక్రాల వాహనం కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది మెజార్టీ కుటుంబాల భావన. ఇదే దృక్ఫథంలో ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం మీద 23 కోట్లకుపైగా కార్లు ఉన్నాయని అంచనా. ప్రతి వెయ్యి మందికి 18కి పైగా కార్లు ప్రస్తుతం రోడ్లమీద పరుగులు పెడుతున్నాయని ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది ప్రతీయేటా అనూహ్యమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. దీంతో అందుకు అనుగుణంగా వచ్చే ఇబ్బందులు కూడా అదే బాటలో ఉంటున్నాయి.
విపరీతంగా పెరిగిపోయే వాహనాలతో కాలుష్యం నిర్ణీత ప్రమాణాల స్థాయిని దాటిపోతోంది. ముఖ్యంగా పార్కింగ్ సమస్య కూడా వెంటాడుతోంది. పెద్ద పెద్దనగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రతి ఇంటి ముందు నాలుగు చక్రాల వాహనం దర్శనమివ్వడం అందరికి చిరపరిచితమే. సదరు పట్టణాల్లో ఏదైనా ఒక వీధిలోకి కారుతో వెళ్ళాలంటే అక్కడున్న ఇళ్ళ ముందు పార్క్ చేసి ఉన్న కార్లను దాటుకుంటూ వెళ్ళడం పద్మవ్యూహాని కంటే కష్టంగానే ఉంటుందని, ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వాళ్ళెవరికైనా గుర్తుండే ఉంటుంది. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నప్పటికీ ఇంటి ముందున్న రోడ్డుమీదే కారును పార్క్ చేయడంతోనే ఇటువంటి పరిస్థితి ఎదురవుతోందన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది.
కారుకు ఓç ³క్క రెండు చక్రాలు రోడ్డు మీదే ఉంటాయి. దీంతో రోడ్డమ్మట వెళ్ళే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక వెళ్ళే దారి కన్పించక హార్న్ కొట్టుకుంటూ వెళితే, అక్కడెవరైనా ఉంటే అడ్డు తీస్తారు లేదంటే వాళ్ళొచ్చేవరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. చిన్న పట్టణాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఇప్పుడు అత్యంత కామన్‌గా కన్పిస్తుంటోంది. డీటీసీపీ అప్రూవల్ ప్రకారం 33 అడుగుల రోడ్డు ఉండాలన్న నిబంధన ఉంది. అయితే ఇంటి ముందు 33 అడుగుల రోడ్డే ఉన్నప్పటికీ ఆ రోడ్డులో రెండు వైపులా రెండు కార్లు పార్క్ చేసి ఉంచితే ఇక మిగిలేది 18 అడుగల రోడ్డు మాత్రమే ఉంటుంది. దీంతో ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ కార్లన్నీ దాటుకుని వెళ్ళడానికి అంబులెన్స్, ఫైర్ ఇంజన్‌లాంటి వాటికి కూడా అడ్డంకులు తప్పక, పుణ్యకాలం కాస్తా గడిచిపోతున్న దాఖలాలు ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో విప్లవాత్మక నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందంట. ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కొనుక్కోవాలంటే, వాళ్ళు తమకు తగిన పార్కింగ్ స్థలం ఉందన్న ధృవీకరణ పత్రం సమర్పించాలన్న రూల్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తద్వారా ఇంటి ముందు, రోడ్డు మీదే పార్కింగ్ చేయడాన్ని నివారించాలన్నది లక్ష్యంగా చెబుతున్నారు. ఇది సక్రమంగా అమలైతే అక్కడ రోడ్లు ప్రయాణానికి అత్యంత అనువుగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.
ఇప్పుడు ఇదే నిర్ణయం అన్ని పట్టణాలు, నగరాల్లో అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్క్ చేసే విధంగా చర్యలు చేపట్టడం ద్వారా రోడ్ల వెంబడి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడానికి అవకాశం దక్కుతుందంటున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా నిర్ణయాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌కు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది.