iDreamPost
android-app
ios-app

పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా…?

పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా…?

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, వీరోచితంగా పోరాడిన, రజాకార్ల అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన ఘనత కృష్ణా జిల్లా పరిటాల గ్రామ ప్రజలది. హైదరాబాద్ స్టేట్, భారత్ లో విలీనానికి ముందే రజాకార్లను నిజాం సైన్యాన్ని తరిమి పరిటాల కానత్ ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి చరిత్ర సృష్టించారు పరిటాల ప్రజలు. ఆజాద్ హింద్ ఫౌండేషన్ లో యుద్ధ తంత్రంలో తర్ఫీదు పొందిన కొంతమంది వీరులు, నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచి సంఘటిత పోరాటం చేసి పరిటాలను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. నిజాంపై పోరాడి గెలిచిన పరిటాల ఫైటింగ్ స్ఫిరిట్ పై ప్రత్యేక కథనం.

కృష్ణా నది పరివాహాక ప్రాంతమైన పరిటాల విజయవాడ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిటాల వయా కంచికచర్ల మీదుగా తెలంగాణ సరిహద్దు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం విజయవాడ-హహైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న పరిటాలలో నిజాం పాలనకు సంబంధించిన అనేక అనవాళ్లు ఉన్నాయి. రాజకీయ ఒప్పందం ప్రకారం సర్కారు జిల్లాలను బ్రిటిషర్లకు అప్పగించిన నిజాం.. పరిటాల కానత్ ను మాత్రం తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ వజ్రాలు సమృద్ధిగా దొరికేవి. 32 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పరిటాల కానత్ కు సుమారు 87 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. ప్రపంచ ప్రఖ్యాత చెందిన వజ్రలు పరిటాల కానత్ లో దొరికినవే. కోహినూర్, పిట్, నిజాం, గోల్కొండ వజ్రాలు ఈ ప్రాంతంలోని గనుల్లోనే లభించాయి. ప్రతి ఏడాది తొలకరిలో వజ్రాల వేట జరుగుతూనే ఉంది. వజ్రాలు దొరికి రాత్రికి రాత్రి శ్రీమంతులైన వారు కూడా ఉన్నారు.

1947 ఆగస్టు 15న వలస పాలకుల నుంచి భారతదేశం విముక్తి చెంది స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్న సమయంలో నిజాం పాలన కింద ఉన్న పరిటాల, ఆత్కూర్, బత్తినపాడు, మొగులూరు, కొడవటికల్లు, మల్లవల్లి, ఉష్ణేపల్లి ప్రజలు నిరంకుశ పాలనలో ఉండలేక తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. నిజాం ఆధీనంలో ఉండటంతో స్వంత్రంత ఫలాలు తమకి అక్కరకు రాకుండా పోయాయని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పరిటాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కానత్ అని పిలిచేవారు. కానత్ అంటే పర్షియన్ భాషలో వజ్రాల గని అని అర్ధం.

Also Read : కాటమరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా..?

పరిటాల కానత్ లోని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని నిజాం సైనికుల ఆధీనంలోనే ఉండగా.. పొరుగు గ్రామాలు మాత్రం ఇండియన్ యూనియన్ లో ఉండేవి. చుట్టుపక్కల గ్రామాల వారితో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ జీవినశైలిలో వైవిధ్యం ఉండేది. పొరుగు గ్రామాల ప్రజలు స్వేఛ్చగా ఉండటం చూసి స్పూర్తి పొందిన పరిటాల కానత్ ప్రజలు కుల, మత బేధాలు విడిచి అందరూ సంఘటితమై పరిటాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పట్టేదార్ జంగ్ బహుదూర్ ను కానత్ శివార్లు దాటే వరకు తరమికొట్టారు.

రజాకార్లకు వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాటం జరిపారు. 1947 నవంబర్ 11న పరిటాల పోలీస్ స్టేషన్ పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 15న స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. అనంతరం సొంత కరెన్సీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పరిటాల దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. ఆజాద్ హింద్ ఫౌండేషన్ ద్వారా పరిటాల కానత్ వీరులు శిక్షణ పొందడంతో స్వాతంత్ర సమరయోధుల దృష్టిని కూడా ఆకర్షించింది.

సెప్టెంబర్ 13న 1948న భారతసైన్యం హైదరాబాద్ స్టేట్ పై మిలిటరీ చర్యను ప్రారంభించిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర స్వాతంత్ర సమరయోధుల సూచనల మేరకు పరిటాల కానత్ ను ఇండియన్ యూనియల్ లో విలీనం చేశారు. పరిటాల కానత్ వీరుల పోరాట స్ఫూర్తికి గుర్తుగా ఓ స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు. జనవరి 26,1950లో భారత్ యూనియన్ లో విలీనమైంది.

మాదిరాజు దేవరాజు నాయకత్వంలో జరిగిన పరిటాల ఉద్యమంలో షేక్ మౌల, చింతల మామయ్య, మాదాసు తిరుపతయ్య, తంగిరాలు పాడ్రాక్ వంటి ప్రముఖులు పొల్గొన్నారు. పరిటాలలోని ప్రస్తుత ప్రభుత్వ స్కూల్ అప్పట్లో జైలుగా ఉండేది. ఇక ఇప్పటి పంచాయతీ ఆఫీస్ స్థానంలో పోలీస్ స్టేషన్ ఉండేది. దాని పక్కన కోర్టు ఉండేది.

Also Read : భారత్ లో కలవని బనగానపల్లె