iDreamPost
iDreamPost
ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఊహించినట్లే ఏకపక్షంగా వచ్చాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఓటమిని ముందే పసిగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పోలింగ్ ముందు ప్రకటించారు. అయితే అప్పటికే బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులు పోటీలో కొనసాగారు. కానీ అధికార వైఎస్సార్సీపీ జోరు ముందు టీడీపీ దాదాపు అన్ని చోట్లా చిత్తు అయ్యింది. ఉత్తరాంధ్రలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫలితాలు దాదాపు ఒకేలా ఉన్నాయి.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ విప్ కూన రవికుమార్, పొలిటీబ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు లతో పాటు టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఈ నియోజకవర్గాలన్నింటిలోను 90 శాతం పైగా ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరడంతో మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఆ పార్టీకే దక్కడం ఖాయమని తేలిపోయింది. దాంతోపాటు మూడు జిల్లాల్లోనూ మెజారిటీ జడ్పీటీసీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడంతో జిల్లా పరిషత్ పీఠాలు కూడా ఆ పార్టీకే దక్కనున్నాయి. అయినదానికీ కానిదానికీ ప్రభుత్వంపై నోరేసుకు పడిపోయే టీడీపీ నేతల నోళ్లు మూయించేలా పరిషత్ ఫలితాలు వెలువడ్డాయి. సొంత నియోజకవర్గాల్లో సదరు టీడీపీ నేతల సత్తా ఏపాటిదో తేల్చేశాయి.
టీడీపీ అధ్యక్షుడి ఇలాకాలో ఫ్యాన్ జోరు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజవర్గం టెక్కలిలో ఆ పార్టీ ఖాళీ అయిపోయింది. నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీలు, నాలుగు మండల పరిషత్తులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టెక్కలిలో దువ్వాడ వాణి, కోటబొమ్మాలిలో దుబ్బ వెంకట్రావు, సంతబొమ్మాలిలో పాల వసంత రెడ్డి, నందిగాంలో పేరాడ భార్గవి జెడ్పీటీసీలుగా భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈ నాలుగు మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీలు వైస్సారసీపీకి దక్కాయి.
మాజీ అధ్యక్షుడు కళాకు భంగపాటు
టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పార్టీ పొలిటీబ్యూరో సభ్యుడు కళా వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గం మొత్తం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్లలో బల్లడ హేమామాలినీ రెడ్డి, లావేరులో మీసాల సీతన్నాయుడు, రణస్థలంలో తంపల సీతారాం, జి.సిగడాంలో కాయల రమణారావు జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. ఈ నాలుగు మండలాల్లోని 90 శాతానికి పైగా ఎంపీటీసీలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి.
Also Read : ఎన్నికలు – బహిష్కరణ- బాబు గారి కొత్త సూత్రీకరణ
మాజీ విప్ కూనకు పరాభవం
మాజీ విప్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ నియోజకవర్గం ఆమదాలవలసలో పరాభవం తప్పలేదు. ఇక్కడ కౌంటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపు ప్రకారం.. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టం అవుతోంది. ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఎంపీటీసీల విషయానికి వస్తే సురబుజ్జిలి, బూర్జ మండలాల్లో మెజారిటీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. పొందూరు, ఆమదాలవలస మండలాల్లో ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆ రెండు మండలాల్లోనూ అధికార పార్టీ ఆధిక్యంలో ఉండటంతో మండల పరిషత్తులన్నీ ఆ పార్టీకే దక్కనున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యేకు నగుబాటు
టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పాగా వేసింది. నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురంలో ఉప్పాడ నారాయణ, కవిటిలో పిరియా విజయ, కంచిలిలో ఇప్పిలి లోలాక్షి, సోంపేటలో తడక యశోద జెడ్పీటీసీలుగా నెగ్గారు. ఈ నాలుగు మండలాల్లో 90 శాతానికి పైగా ఎంపీటీసీలుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఎన్నిక కావడంతో ఎంపీపీ అధ్యక్ష పదవులు కూడా ఆ పార్టీకే లభించనున్నాయి.
Also Read : నాడు కొడాలి మీద కథలు అల్లితిరే .. నారావారిపల్లె ఓటమి మీద ఇప్పుడేమంటారు బాబు?
అయ్యో.. అయ్యన్న
ఇక విశాఖ జిల్లాలో మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సొంత నియోజకర్గం నర్సీపట్నంలో అయ్యన్న సత్తా ఏమిటో ఈ ఎన్నికలు తేల్చేశాయి. ఒక్క నర్సీపట్నం జెడ్పీటీసీ మినహా మిగిలిన అన్నింటి లో వైఎస్సార్సీపీ వినయ ఢంకా మోగించింది. గొలుగొండలో సర్ల గిరిబాబు, నాతవరంలో కాపారపు అప్పుల నరస, మాకవరపాలెంలో పెట్ల సత్యవేణి వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు. నర్సీపట్నం జెడ్పీటీసీని మాత్రం టీడీపీ అభ్యర్థి సకల రమణమ్మ చేజిక్కించుకున్నారు. అయితే నర్సీపట్నంతోపాటు మిగిలిన మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం కావడంతో మొత్తం నాలుగు ఎంపీపీలు ఆ పార్టీకే దక్కనున్నాయి.
మూడు జెడ్పీ పీఠాలు వైఎస్సార్సీపీకే
ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ 99 శాతం జెడ్పీటీసీలను గెలుచుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ తెలుగుదేశానికి కోలుకోలేని దెబ్బ తీసింది. విశాఖ జిల్లాలో 39 జెడ్పీటీసీలకు గాను 38కి ఎన్నికలు జరగ్గా ఒక్క నర్సీపట్నంలోనే టీడీపీ విజయం సాధించింది. ఆనంతగిరిని సీపీఎం దక్కించుకోగా మిగిలిన 36 జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 34, శ్రీకాకుళం జిల్లాలో 38కి గాను ఎన్నిక జరిగిన 37 జెడ్పీటీసీలను కైవసం చేసుకొని వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ప్రతిపక్షం అన్నదే లేకుండా ఈ మూడు జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాలు అధికార పార్టీకి లభించనున్నాయి.
ఎంపీటీసీల ఎన్నికల్లో విశాఖ జిల్లాలో మొత్తం 617 స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 450, టీడీపీ 118 స్థానాల్లో విజయం సాధించాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 549 స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 444, టీడీపీ 86 స్థానాల్లో గెలిచాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 667 ఎంపీటీసీలకు గాను ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో వైఎస్సార్సీపీ 484, టీడీపీ 74 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ మూడు జిల్లాల్లోని మొత్తం అన్ని మండల పరిషత్తులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోనుంది.
Also Read : కుప్పం కోట మీద వైసీపీ జండా ఎగరేసిన హాసిని