రాష్ట్రంలో పరి పూర్ణానంద స్వామి గురించి చాలామందికి బాగా తెలుసు. ఆలోచింపచేసే ప్రసంగాలతో ఆయన ఎంతోమందిని ఆకట్టుకున్నారు. సర్వసంగ పరిత్యాగి అయిన ఆయనకు ఎందుకో కానీ రాజకీయాలపై ఎక్కడా లేని మోజుపుట్టింది. అప్పుడు కాదు ఇప్పుడు ఏదో ఒక పదవి చేపట్టి కేంద్ర స్థాయిలో తన హవా చాటాలనుకుంటున్నారు.
ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలకు బీజేపీ తరఫున టికెట్ కోసం సర్వ శక్తులు ఒడ్డారు. ఈక్వేషన్ లు, రాజకీయ లెక్కలు కుదరకో, లేక మరే ఇతర కారణాల వల్లో స్వామి వారికి టిక్కెట్ రాలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి తల దూర్చలేదు. తాజాగా ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యారు. బిజెపి అభ్యర్థి రత్నప్రభ కు ఓటు వేయాలంటూ ఓటర్లకు జ్ఞానబోధ చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో లో బీజేపీ అభ్యర్థి ని గెలిపించడమే అన్ని విధాలా శ్రేయస్కరమని ప్రజలకు నూరి పోసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు ఇంతకు ఈయన స్వామీజీ నా లేక రాజకీయ నాయకుడా అని చర్చించుకుంటున్నారు.
స్వామీజి అయిన పరిపూర్ణానంద గతంలోనూ ఎన్నికల సమయంలో ఏపీలో కాకినాడ నుంచి తిరుమలకు యాత్ర సాగించారు. హిందూత్వంపై ప్రచారం చేస్తూ బీజేపీకి ఓట్లు వేయాలని పరోక్ష ప్రచారం చేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగింది. ఆ ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున ఆయన ప్రచారం సాగించారు. దేశ వ్యాప్తంగా పలువురు సాధువులు, సాధ్వీలు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా అధికారం చెలాయిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా సాధువే. వీరి తరహాలోనే తాను కూడా అధికార పీఠంపై కూర్చొవాలనే ఆశలు పరిపూర్ణనందలో ఉన్నాయి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడకు వచ్చి బీజేపీ తరఫున ప్రచారం చేస్తుంటారు. ప్రస్తుతం బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి ఉప ఎన్నికల్లోనూ స్వామీజి ప్రత్యక్షమయ్యారు.
Also Read : రైతులపై భారం మోపుతూ మోడీ సర్కారు నిర్ణయం, అన్నదాతల్లో కొత్త ఆందోళన
తిరుపతి లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తున్న స్వామీజీ పనిలోపనిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ను ఆ ముగ్గులోకి లాగారు. మొన్న రమణ దీక్షితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అంతలా పొగడడం సరికాదని స్వామీజీ తప్పు పట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు అలా వ్యవహరిస్తే టీటీడీ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రబిందువు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు ను తప్పుబడుతున్న పరిపూర్ణానంద స్వామీజీకి గురిగింజ సామెత తెలియదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
స్వామీజీ గా, సర్వసంగ పరిత్యాగి అయిన పరిపూర్ణానంద స్వామి రాజకీయాలు మాట్లాడటం, ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రత్నప్రభను గెలిపించడానికి జ్ఞాన బోధ చేసే పని పెట్టుకోవడం కరెక్ట్ అయినప్పుడు రమణదీక్షితులు మాట్లాడడం తప్పేలా అవుతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు పరిపూర్ణానంద స్వామి అధికార పార్టీపై పరోక్షంగా ఇంతలా విరుచుకు పడుతున్నారంటే ఆయనకు కు ఎవరి నుండి ఎలాంటి ఒత్తిడి ఉందో పాపం అని మరికొంతమంది సాధువులు, సన్యాసులు చర్చించుకుంటున్నారు. వారు ఇదే పరిపూర్ణానంద స్వామి కి ముచ్చటగా మూడు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే తిరుపతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బిజెపి పెద్దలు మాట ఎందుకు నిలుపుకోలేదు. ఆరు కోట్ల ఆంధ్రుల కలల సౌదం అయిన విశాఖ ఉక్కు ను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏపీకి బీజేపీ చేసిన మేలు ఏంటి..?
ఈ మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే తామంతా కూడా బీజేపీకే ప్రచారం చేస్తామని ఆ సాధుపుంగవులు చెబుతున్నారు. మరి ఈ ప్రశ్నలకు పరిపూర్ణానంద స్వామీజీ వారు సమాధానం చెబుతారా లేక తాను రాజకీయవాది కాదంటూ రాజకీయం చేస్తూ ముందుకు సాగుతారా అన్నది వేచి చూడాల్సిన అంశం.
Also Read : తిరుపతి ఉప ఎన్నిక : ముందే చేతులెత్తిసిన అచ్చెం నాయుడు