Idream media
Idream media
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీలో సీటు పోరు ప్రారంభమైంది. ఒకరి సీటుకు మరొకరు ఎసరుపెట్టే ప్రయత్నాలు ప్రారంభం కావడంతో టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మరోసారి తనకు సీటుకు ఎసరుపెట్టే ప్రయత్నాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాజీ మంత్రి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఫైర్ అయ్యారు. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని పల్లె తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అంతేకాదు జేసీ రాజకీయ అజ్ఞాని అంటూ పల్లె మండిపడ్డారు.
పల్లెకు ఇస్తే ఓడిపోతాం..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే ఓడిపోతామని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించారు. పల్లెకు తప్పా మరెవరికి ఇచ్చినా గెలుస్తామని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో నియోజకవర్గానికి ఏ మాత్రం పరిచయంలేని సైకం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి పుట్టపర్తి టిక్కెట్ ఇవ్వాలంటూ ప్రతిపాదించారు. ఈ పరిణామంతో జేసీపై పల్లె రఘునాథరెడ్డికి చిర్రెత్తుకు వచ్చింది. తన సీటుకు ఎసరుపెట్టేందుకు యత్నిస్తుండడంతో జేసీ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు పల్లె రంగంలోకి దిగారు.
చరిత్రను గుర్తుచేస్తూ..
జేసీ ప్రభాకర్ రెడ్డి గతచరిత్రను గుర్తుచేస్తూ ఆయన దూకుడుకు పల్లె కళ్లెంవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓ రౌడీ అని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. గత 35 ఏళ్లుగా టీడీపీ నేతలపై జేసీ కుటుంబం దాడులు చేసింది.. అక్రమ కేసులతో వేధించిందన్నారు. 2014లో టీడీపీ కండువా కప్పుకోవటానికి జేసీ నామోషీగా ఫీలయ్యాడంటూ గతాన్ని గుర్తుచేశారు. పరిటాలకు భయపడి జేసీ తాడిపత్రి నుంచి పారిపోయాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తమపై పెత్తనం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోనని పల్లె హెచ్చరించారు. పల్లె హెచ్చరికలపై జేసీ దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.