iDreamPost
android-app
ios-app

సినీ పద్మాలు

  • Published Jan 27, 2020 | 2:20 AM Updated Updated Jan 27, 2020 | 2:20 AM
సినీ పద్మాలు

నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మా అవార్డుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎంపిక పట్ల సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ప్రతిసారి విస్మరించడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న లిస్టులో బాలాజీ టెలి ఫిలిమ్స్ ఏక్తా కపూర్ కు పద్మను ప్రదానం చేయనుండటం పట్ల ముఖ్యంగా ప్రేక్షకులు విస్మయం ప్రకటిస్తున్నారు. 

టెలివిజన్ రంగంలో సీరియల్స్ రూపంలో పెను విప్లవం వచ్చేందుకు ఏక్తా ఒక కారణం అయినప్పటికీ అవేవి ఉన్నత విలువలతో రూపొందినవి కావు. అక్రమ సంబంధాలు, పగలు ప్రతీకారాలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు. రెండో పెళ్లి ప్రహసనాలు వీటినే కథాంశాలుగా తీసుకుని చేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఏక్తా చేసింది జస్ట్ వ్యాపారం అంతే. ఇక వెబ్ సిరీస్ లు మొదలయ్యాక ALT ప్లాట్ ఫార్మ్ మీద ఏక్తా వదిలిన అడల్ట్ కంటెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాగిణి ఎంఎంఎస్, గంధీ బాత్ లాంటివి కొన్ని శాంపిల్స్ మాత్రమే. వీటిని వెనుక నుంచి అప్రూవ్ చేసింది నిర్మాత ఏక్తా కపూరే. 
మరి ఏదో గొప్పసేవలు చేసిన తరహాలో ఏక్తా కపూర్ కు ఈ పురస్కారం ఇవ్వనుండటం పట్ల విమర్శలు రావడంలో తప్పు లేదు. ఇక మనవైపు చూసుకుంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరైన సత్యనారాయణ, కృష్ణంరాజు లాంటి వాళ్లకు ఇప్పటికీ ఇది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. స్వర్గీయ ఎన్టీఆర్ కు సైతం దీనికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో దేని ప్రతిపాదికన పద్మ అవార్డులు ఇస్తారో చెప్పాలని సినిమా ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది రాజమౌళి, సిరివెన్నెల గార్లకు ఇచ్చారు కానీ ఇంకా అందుకోవాల్సిన అర్హులు చాలా ఉన్నారు.