Idream media
Idream media
సత్యనారాయణ అంటే చిన్నప్పుడు భయం, కోపం, అసహ్యం. స్క్రీన్ మీదకి దూకి తన్నేసేంత ఆవేశం. అంత గొప్ప నటుడు ఆయన. కూనగా ఉన్నప్పట్నుంచి సినిమాలు చూస్తున్నా, గుర్తు పట్టింది మాత్రం కోడలు దిద్దిన కాపురంలోనే. అప్పుడు నా వయసు ఏడేళ్లు. రాయదుర్గం KB ప్యాలెస్‌లో వేశారు. ఫస్ట్ షోకి మా నాన్న తీసుకెళ్లాడు.
జట్కావాలా వలీసాబ్ కోసం సాయంత్రం నుంచి ఎదురు చూస్తే మొత్తం మీద వచ్చాడు, గుర్రాన్ని ముట్టుకోబోతే బుస్‌మంది. జట్కాలో NTR, ANR ఫొటోలుండేవి. పిల్లలకి అదో ఆకర్షణ. నేను , నా పిల్లలు , గుర్రం కలిసి బతకాలి. బాడుగ కొంచెం చూసి ఇయ్యండయ్యా అని వలీసాబ్ అడిగేవాడు. ఒకరోజు గుర్రం జారి పడితే అతను పసి పిల్లాడిలా ఏడ్వడం ఇంకా గుర్తుంది.
థియేటర్‌లోకి వెళ్లే సరికి NTR ఏదో చెబుతున్నాడు. ఆయన 200 సినిమా. సినిమా బిగినింగ్‌లోనే బాబా గెటప్‌లో సత్యనారాయణ కనిపించే సరికి భయం పట్టుకుంది. ఆయనకు తోడు సూర్యకాంతం, నాగభూషణం ప్రేమ్‌లోకి వచ్చారు. భయం ఇంకా పెరిగింది. ఆశ్చర్యంగా వాళ్లిద్దరూ ఈ సినిమాలో మంచివాళ్లు. సత్యనారాయణ ఒకడే విలన్.
ఆ తర్వాత సత్యనారాయణ ఎన్నో రూపాలు చూశాను. దొంగల నాయకుడిగా తారు డ్రమ్ములు , చెక్క పెట్టెల డెన్‌లో వుంటూ మందు తాగుతూ , అటుఇటూ ఇద్దరమ్మాయిలతో భుజాలపై చేతులేసి జగ్గూ అని అసిస్టెంట్‌ని పిలిచేవాడు. కొన్ని సినిమాల్లో ఆయనే జగ్గూ. స్మగ్లర్‌గా సూట్‌కేసులు మార్చేవాడు. హీరో తల్లిదండ్రుల్ని చంపి, చివరికి హీరో చేతిలో పోయేవాడు. మాంత్రికుడిగా హీరోయిన్‌ని ఎత్తుకెళ్లేవాడు. చూపుతోనే హడలగొట్టేవాడు.
1973లో శారద సినిమా చూసి సత్యనారాయణ కూడా మంచోడేననే నమ్మకం కుదిరింది. మతిస్థిమితం లేని చెల్లిని ఆదరించే అన్నగా ఆయన నటన అద్భుతం. నిప్పులాంటి మనిషిలో స్నేహమేరా జీవితం పాట పాడి జంజీర్‌లో ప్రాణ్‌ని మరిపించాడు.
యమగోలలో యముడే. ముగ్గురు మూర్ఖులులో కామెడీ కూడా చేశాడు. SVR తర్వాత సత్యనారాయణ, ఆయనకు దీటుగా రావుగోపాలరావు, ఈ తరంలో ఆయన కొడుకు రావు రమేశ్. నవరసాల్ని మెప్పించగల అరుదైన నటులు.
సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చారు కానీ, ఇమడ లేదు. ఈ వయసులో కూడా క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసే గొప్పతనం ఆయన సొంతం. యముడు ఎలా వుంటాడో మనకి తెలియదు. సత్యనారాయణే తెలుసు. ఆయన్ని యముడు కూడా ఏం చేయలేడు. ఆస్పత్రి నుంచి వచ్చేసి నిండు నూరేళ్లు వుంటాడు.
కాలం చేసే గాయాల్ని అందరూ ఆమోదించాల్సిందే. కానీ కాలాన్ని కూడా కైకాల జయించాలనే ఆకాంక్ష.
వచ్చేయి, పెద్దాయన. కరోనాతో చాలా మందిని పోగొట్టుకున్నాం. ఇంకా పోగొట్టుకునే శక్తి లేదు.
Also Read : Drushyam 2 : వెంకీ అభిమానుల కోపం చల్లరేనా