iDreamPost
android-app
ios-app

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. భవిష్యవాణి వినిపించిన రంగం స్వర్ణలత!

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. భవిష్యవాణి వినిపించిన రంగం స్వర్ణలత!

హైదరాబాద్ ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరవాసులు మొదలు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సైతం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉజ్జయిని బోనాలు అనగానే అందరికీ రంగం గురించి ఎంతో ఆసక్తి ఉంటుంది. భవిష్యవాణి ఏం చెప్తారు? ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? రైతులకు ఈ ఏడాది కలిసి వస్తుందా? వంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.

ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. “ప్రజల పూజలు సంతోషంగా స్వీకరించాను. కానీ, గతేడాది చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారు. మీకు కావాల్సిన బలాన్ని ఇచ్చాను. నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటాను. ఈ ఏడాది వర్షాలు విషయంలో చింతించకండి. ఆలస్యం అయినా కూడా.. వర్షాలు తప్పకుండా వస్తాయి. మీరు అగ్నిప్రమాదాల విషయంలో భయపడద్దు. నా వద్దకు వచ్చే ప్రజలు అందరినీ కాపాడే బాధ్యత నాదే. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే భారం నాదే. ఐదు వారాలు తప్పనిసరిగా నేవేద్యాలు సమర్పించాలి” అంటూ రంగంలో స్వర్ణలత చెప్పుకొచ్చారు.

రంగం కార్యక్రమంపై మంత్రి తలసాని స్పందించారు. “రంగం కార్యక్రమం పూర్తయింది. నిన్న రాత్రి మొత్తం దర్శనాలు జరిగాయి. సీఎం, మంత్రులు, ఇతర పార్టీల నేతలు కూడా దర్శనం చేసుకున్నారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని డిపార్టుమెంట్లు సహకరించాయి. భవిష్యవాణిలో అమ్మవారు బోనాలు బాగా జరిగాయని చెప్పడం సంతోషం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేశాం” అంటూ మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.