Meta Threads: ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్.. ఈ వారంలోనే లాంఛ్ చేయనున్న మెటా!

Meta Threads: ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్.. ఈ వారంలోనే లాంఛ్ చేయనున్న మెటా!

ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎలన్ మస్క్ తరచూ తన చర్యలతో అందరికీ షాకిస్తూ ఉంటాడు. ప్రముఖ ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నాడు. సబ్ స్క్రిప్షన్ వంటివి తీసుకు రావడమే కాకుండా.. రోజుకు ఇన్ని ట్వీట్లే చూడాలి అంటూ కండిషన్ కూడా పెట్టాడు. బ్లూ టిక్ ఉన్న వాళ్లు రోజుకు 10 వేల ట్వీట్లు, సబ్ స్క్రైబ్ చేసుకోని వారు అయితే రోజుకు వెయ్యి ట్వీట్లు చూడచ్చు. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు రోజుకు 600 ట్వీట్లు మాత్రమే చూడగలరు. ఈ నిర్ణయంతో అంతా నిర్ఘాంతపోయారు.

అయితే ఎప్పుడూ మస్క్ షాకులు ఇస్తూ ఉంటే.. ఇప్పుడు జుకర్ బర్గ్ మస్కుకు షాకిచ్చాడు. ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ అనే యాప్ ను తీసుకురాబోతున్నాడు. జులై 6వ తేదీన ఈ మెటా థ్రెడ్స్ ని లాంఛ్ కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ప్రీ ఆర్డర్ వెసులుబాటును కూడా కల్పించారు. మొదట యూకేలో ప్లేస్టోర్ లో థ్రెడ్స్ సడెన్ గా ప్రత్యక్షమైంది. ఆ తర్వాత యాపిల్ ప్లే స్టోర్ లో ప్రీ ఆర్డర్ చేసుకోండి అంటూ లిస్టింగ్ అయింది.

మస్క్ తీసుకునే నిర్ణయాలతో ట్విట్టర్ యూజర్లు ఒకింత వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే. ఇదే మంచి సమయంగా భావించి జుకర్ బర్గ్ ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ ను హుటాహుటిన లాంఛ్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ ని కలుపుతూ ఈ థ్రెడ్స్ ని డిజైన్ చేశారు. కాబట్టి ఇన్ స్టా యూజర్లు మొత్తం థ్రెడ్స్ కి వస్తారని భావిస్తున్నారు. ఈ యాప్ తమ ఫేవరెట్ క్రియేటర్లతో కమ్యునికేట్ అయ్యేందుకు.. కొన్ని సమూహాలు చర్చలు జరిపేందుకు వీలుగా ఈ యాప్ ని డిజైన్ చేశారు.

సోషల్ మీడియాలో థ్రెడ్స్ పై గట్టిగానే చర్చ జరుగుతోంది. తాము ఈ యాప్ లాంఛ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ కొందరు యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం తాము ట్విట్టర్ వదిలి రామంటూ చెబుతున్నారు. మస్క్ మీద నమ్మకం ఉంచి ట్విట్టర్ లోనే కొనసాగాలంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఎన్ని కొత్త యాప్స్ వచ్చినా కూడా ట్విట్టర్ కు పోటీ రాలేవంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ థ్రెడ్స్ ఎంత మేరకు యూజర్లను ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకో రెండ్రోజులు ఆగాల్సిందే.

Show comments