iDreamPost
android-app
ios-app

రెస్టారెంట్‌లో పీతల కూర ఆర్డర్.. బిల్ చూసి బిత్తరపోయింది!

రెస్టారెంట్‌లో  పీతల కూర ఆర్డర్.. బిల్ చూసి బిత్తరపోయింది!

ఇటీవల కాలంలో ఫుడ్ ఎంజాయ్ చేసే వారి శాతం రోజు రోజుకూ పెరిగిపోయింది. రకరకాల ఫుడ్స్ ట్రై చేస్తున్నారు. అందుకే రెస్టారెంట్లు సైతం ఓన్లీ ఇండియన్ ఫుడ్సే కాకుండా ఫ్రెంచ్, చైనీస్, ఇటాలియన్, కొరియన్ వంటి ఇంటర్నేషనల్ ఫుడ్స్‌ను వండి వడ్డి వారుస్తున్నాయి. ఇతర దేశస్థులకు ఇది వరంగా మారింది. ఇక పర్యటనల నిమిత్తం వివిధ దేశాలకు వెళితే.. దేశీయ ఫుడ్స్‌తో పాటు కొన్ని స్థానిక ఆహార పదార్ధాలను ట్రై చేస్తుంటారు. అయితే అక్కడ ధరల్లో అటుఇటుగా కాస్త మార్పు ఉంటుంది. లేదంటే వెయిటర్‌ని అడిగి తెలుసుకుంటారు. జపాన్ నుండి సింగపూర్ వెళ్లిన ఓ మహిళ.. అలా ఓ రెస్టారెంట్ లో తనకిష్టమైన పీతల కూర తింది. తీరా బిల్లు చూసి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇంతకు ఆమెకు ఎంత బిల్లు వేశారంటే..?

జపాన్‌కు చెందిన జుంకో షిన్బా.. ఇటీవల సింగ పూర్‌కు వెళ్లింది. అక్కడ ఓ రెస్టారెంట్ లోకి వెళ్లి చిల్లీ క్రాబ్ వంటకాన్ని ఆర్డర్ చేసింది. పీతల వంటకం రాగానే ఆవురావూరు మంటూ తినేసింది. తీరా బిల్లు చూసే సరికి బిత్తరపోయింది. ఆమె తిన్న ఒక్క పీతకే 938 డాలర్లు( ఇండియన్ కరెన్సీలో రూ. 57 వేలు) బిల్లు వేశారు. బిల్లు చూసి.. తనకు చెప్పిన ధర.. ఇక్కడ వేసిన ధర వేరంటూ పోలీస్ స్టేషన్ చెంతకు చేరింది. ఆ రెస్టారెంట్ లో వెయిటర్ తనను అలస్కాన్ కింగ్ క్రాబ్ చిల్లీ డిష్‌ చాలా బాగుంటుందని, దాన్ని ప్రయత్నించమని చెప్పాడని పేర్కొంది. దాని ధర  కేవలం 30 డాలర్లు అని (రూ. 2500) చెప్పడంతో ఆర్డర్ పెట్టినట్లు తెలిపింది.

 కేవలం 100 గ్రాముల పీతకు మాత్రమే ఈ కాస్ట్ చెల్లుతుందని చెప్పలేదని మహిళ తెలిపింది. తనతో పాటు వచ్చిన మొత్తం బృందం వారికి నచ్చిన ఆహారం ఆర్డర్ పెట్టుకుని తిన్నారు. మొత్తం బిల్లు 1,322 డాలర్లు (రూ. 80 వేలు) ఉండగా..ఈ ఒక్క ఈ డిష్ మాత్రమే 938 డాలర్లు బిల్ వేశారని, ఇతర వంటకాల ధర 20 డాలర్లు లేదా అంతకంటే తక్కువని చెప్పారు. పీత బరువును బట్టి బిల్ ఉంటుందన్న విషయం రెస్టారెంట్ ముందు తనకు చెప్పలేదని, అయితే అంత డబ్బులు తమ వద్ద లేవని చెప్పడంతో.. 107 డాలర్లు తగ్గించినట్లు తెలిపింది. ఒక్క పీత ధర తులం బంగారం (22 క్యారెట్లు) కన్నా ఎక్కువ ఉండటం గమనార్హం.