Idream media
Idream media
ఒక అమ్మాయి కన్నీళ్లు “ఛపాక్”
ఎప్పుడైనా పొరపాటున వేడి కాఫీ మీద పడితేనే విలవిల్లాడి పోతాం. అలాంటిది ముఖంపైన, కళ్లలోనూ, ఒంటిమీద ఆసిడ్ పడితే ఆ బాధ ఊహించడానికి కూడా భయమేస్తుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో 500-1000 మంది అమాయక ఆడపిల్లలు ఈ హింసకు బలవుతున్నారు.
ఆసిడ్ దాడి గురించి మనకు పత్రికల్లో, టీవీల్లో వార్తలుగానే తెలుసు. చదివి కాసేపు బాధపడి మరిచిపోతాం. కానీ ఆ అమ్మాయిలకి జీవిత కాలపు నరకం. చాలా కేసుల్లో నిందితులకి శిక్ష పడడం లేదు. పడినా హైకోర్టుల్లో తప్పించుకుంటున్నారు.
2005లో ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిపై ఆసిడ్ దాడి జరిగింది. అనేక సర్జరీల తర్వాత ఆమె కోలుకుని ఆసిడ్ అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ కథనే దీపికా పడుకునే హీరోయిన్‌గా ఛపాక్ (హిందీ) సినిమా శుక్రవారం వచ్చింది. గుల్జార్ కుమార్తె మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. పాతతరం నటి రాఖీ, మేఘనకి తల్లి.
ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో దుక్కం ఆవరిస్తుంది. చాలా సన్నివేశాల్లో కళ్లలో నీళ్లు కదులుతుంటాయి. సినిమా ఫార్మట్‌కి కొంచెం భిన్నంగా డాక్యుమెంటరీ తరహాలో ఉన్నా రెండు గంటలు థియేటర్‌లో కూర్చో పెడుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులకి ఇది బోర్‌గానే ఉండొచ్చు, కానీ ఒక బాధితురాలు చేసిన పోరాటం ,అనుభవించిన హింస ఆలోచనలోకి నెడుతుంది.
గ్లామర్ నటి దీపికా, ఈ పాత్ర చేయాలనుకోవడమే సాహసం. సినిమాలో పది నిమిషాలు మినహా , మిగతా అంతా కాలిపోయిన మొహంతోనే కనిపిస్తుంది. ఆసిడ్ పడినపుడు ఆ బాధని దీపిక నిజంగా అనుభవించిందా అనేంత అద్భుతంగా నటించింది.
ఈ బాధితుల్లో ఎక్కువ మంది మధ్య తరగతి, పేదవాళ్లు. వైద్యాన్ని భరించే స్థోమత కూడా ఉండదు. లక్ష్మీఅగర్వాల్‌కి కూడా స్వచ్ఛంద సంస్థల సాయం లభించింది. మొత్తం 7 సర్జరీలు జరిగాయి.
అందుకే సినిమాలో ఒక బాధితురాలు చనిపోయినపుడు దీపిక అంటుంది…”సర్జరీలు, కోర్టులు అవసరం లేని చోటికి వెళ్లిపోయింది” అని.
దీపిక తప్ప, మనం గుర్తు పట్టే నటులెవరూ లేరు ఈ సినిమాలో. దీపిక కూడా గుర్తు పట్టలేకుండా ఉంది. కాలిపోయిన ముఖాన్ని మొదటిసారి అద్దంలో చూసుకున్నపుడు దీపికతో పాటు ప్రేక్షకులు కూడా కంటతడి పెడతారు.
సుప్రీంకోర్టు నియంత్రించినప్పటికీ యాసిడ్ అమ్మకాలు ఆగలేదు. దాడులూ ఆగలేదు. ఇది చూడాల్సిన సినిమా. ఇతరుల బాధని మనం అనుభవించలేక పోవచ్చు, కానీ ఎంతోకొంత పంచుకోవచ్చు.
ఈ సినిమా చూస్తుంటే భయం కూడా వేస్తుంది. ముద్దుగా పెంచుకున్న బిడ్డలపై వేటగాళ్లు దాడి చేస్తారేమోనని. జీవితాల్ని కాల్చేసే యాసిడ్, ఇంకా ఎక్కడపడితే అక్కడ దొరుకుతూ ఉందంటే, మన ప్రభుత్వాలకి ఎంత బాధ్యతుందో అర్థమవుతుంది.