iDreamPost
android-app
ios-app

Ooyala : కవల పిల్లల సెంటిమెంట్ డ్రామా – Nostalgia

  • Published Nov 06, 2021 | 12:22 PM Updated Updated Nov 06, 2021 | 12:22 PM
Ooyala : కవల పిల్లల సెంటిమెంట్ డ్రామా – Nostalgia

భావోద్వేగాలను సరిగ్గా చూపించాలే కానీ తల్లి సెంటిమెంట్ తో మాస్ క్లాస్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకోవచ్చు. ఈ సూత్రాన్ని సరిగ్గా పాటించడం వల్లే మాతృదేవోభవ, అమ్మ రాజీనామా లాంటి సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. వీటిలో స్టార్లు ఉండరు. కేవలం ఆర్టిస్టులు ఉంటారు. అయినా కూడా బ్రహ్మరథం దక్కింది. అలాంటి మరో చక్కని చిత్రం ఊయల. ఆ విశేషాలు చూద్దాం. 1997లో మలయాళంలో జయరాం మంజు వారియర్ జంటగా ఇరట్టకుట్టికలుదే అచన్ సినిమా వచ్చింది. మంచి హిట్ గా నిలిచింది. టైటిల్ కి అర్థం కవల పిల్లల తండ్రి. దీన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ హక్కులు కొన్నారు.

అప్పుడు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి మంచి ఫామ్ లో ఉన్న సమయం. ఆయన పేరు చూసి బయ్యర్లు హీరో ఎవరని చూడకుండా బిజినెస్ చేసేవారు. యమలీల, నెంబర్ వన్, రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి హిట్లు చేసిన సంచలనాలు అంతా ఇంతా కాదు. హీరోగా చేద్దామని ముచ్చట పడిన ఉగాది ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో మళ్ళీ డైరెక్షన్ కు వచ్చారు. అప్పుడు చేసిందే ఊయల. అప్పటికే శ్రీకాంత్ కు ఈయనకు హ్యాట్రిక్ హిట్లు ఉన్నాయి. వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం మూడూ వంద రోజుల బొమ్మలే. అందుకే కాంబినేషన్ ప్రకటించగానే క్రేజ్ వచ్చేసింది. అప్పటికే ఎస్వికె కామెడీ నుంచి రూటు మార్చుకుని సెంటిమెంట్ ఎక్కువగా చేస్తున్నారు.

రమ్యకృష్ణ హీరోయిన్ గా ఎంపిక కాగా నాజర్, సుహాసిని, జయప్రకాశ్ రెడ్డి, ఎస్పి బాలసుబ్రమణ్యం, రమాప్రభ, ఏవీఎస్, బ్రహ్మానందం తదితరులు ఇతర తారాగణం. ఎస్వి ఆస్థాన రచయిత దివాకర్ బాబు సంభాషణలు సమకూర్చారు. ఓ మధ్యతరగతి జంటకు పుట్టిన కవలల్లో ఒకరిని తల్లికి తెలియకుండా వేరొక దంపతులకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. కానీ కొన్ని పరిణామాల తర్వాత అసలు తల్లికి నిజం తేలిపోతుంది. ఆవిడలో అమ్మ ఒప్పుకోదు. తర్వాత జరిగేది సినిమాలో చూడాలి. 1998 జనవరి 14న ఊయల రిలీజయింది. దీంతో పాటు ఆవిడా మా ఆవిడే, ఖైదీగారు, పరదేశి, సంభవం అదే రోజు విడుదలయ్యాయి. ఇంత పోటీలోనూ ఊయల మంచి సక్సెస్ సాధించింది

Also Read : Love In Singapore : మెగాస్టార్ నటించిన ఫారిన్ లవ్ స్టోరీ – Nostalgia