iDreamPost
iDreamPost
ఉల్లీ ఉల్లీ నువ్వేం చేస్తావూ అనడిగితే కోసే వాళ్ళకే కాకుండా కొనే వాళ్ళకు కూడా కన్నీళ్ళు తెప్పించేస్తాను అంటోంది. ఇప్పుడు ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇలానే మారుతోంది. ఒక పక్క కూరగాయల ఖర్చు అమాంతంగా పెరిగిపోగా, ఇప్పుడు ఉల్లిపాయల ఖర్చు దాదాపు రెండు రెట్లు పెరిగిపోయింది. గతంలో రూ. 15–25 మధ్య తచ్చాడిన కేజీ ఉల్లి ధర ప్రస్తుతం రూ. 40–60ల మధ్య అటూఇటూ ఊగుతోంది. ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిపై పడే భారం కావడంతో సర్వత్రా ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పాలి.
ఒక పక్క వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ఆనందించేలోపే దీని ప్రభావం సగటు మనిషిపై పడుతోంది. దేశ వ్యాప్తంగా ఏకధాటిగా పడుతున్న వర్షాలతో ఉల్లిపంట తీవ్రంగా దెబ్బతింది. ఎక్కువ రోజులు నిల్వ ఉండే సరుకు కాకపోవడంతో నెమ్మదిగా కొరతకు ఆస్కారం ఏర్పడుతోంది. దీంతో ధరల పెరుగుదల దిశగా సాగుతోంది. దీనికి మధ్యలో అక్రమ నిల్వదారులు ఉండనే ఉంటారు. అసలే కోవిడ్ కారణంగా ఆచితూచి ఖర్చు పెట్టుకుంటున్న సగటు జీవుడు ఉల్లి ధర దెబ్బకు మరోసారి జేబు తడుముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
యేడాది ప్రారంభంలో ఉల్లిపాయల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఆందోళనకు కూడా సిద్ధమైపోయారు. అయితే ప్రభుత్వం అప్రమత్తమై రైతు బజార్ల ద్వారా ఉల్లిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు విదేశాల నుంచి కూడా దిగుమతులు ఊపందుకోవడంతో పరిస్థితి చక్కబడింది. అయితే మరో సారి ధరల పెరుగుదల దిశగానే సాగుతోంది.
ఉల్లిపాయల ఉత్పత్తి వినియోగంలో భారత్, చైనాలదే అగ్రస్థానంగా చెబుతారు. మన దేశంలో 1,064 హెక్టార్లలో ఉల్లిసాగు చేస్తుండగా మొత్తం ఉత్పత్తిలో 19శాతం ఉల్లిని ఉత్పత్తి చేస్తున్నాము. అలాగే చైనా 930 హెక్టార్లలో సాగు చేస్తుండగా మొత్తం ఉత్పత్తిలో 26శాతానికిపైగా చైనా వాటాదే. ఇతర ఉల్లి ఉత్పత్తి దేశాలేమీ ఈ రెండు దేశాలకు కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.
దేశంలో కూడా ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. దాని తరువాత అయిదవ స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. మొత్తం ఉత్పత్తిలో ఈ రాష్ట్రాలది కేవలం 5శాతం మాత్రమే. దీంతో ఉల్లి దిగుమతులు చేసుకోవడం తప్పని సరి అవుతోంది. అయితే ఉల్లి పండే అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణం అనుకూలంగా లేదు. దీంతో పంట ఉత్పాదనపై దాని ప్రభావం పడిందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా ఏప్రియల్ నెలలో ఈ పంట దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. ఆ తరువాత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే పంట చేతికొస్తుంది. అయితే ఈ సమయంలోనే వర్షాలు ముంచెత్తి దిగుబడిపై ప్రభావం పడింది. ఈ కారణంగానే అధిక ధరలు పలుకుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.