Dharani
పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. తాజా నిర్ణయంతో ఉల్లి ధరలు దిగి రానున్నాయి అంటున్నారు. ఆ వివరాలు..
పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. తాజా నిర్ణయంతో ఉల్లి ధరలు దిగి రానున్నాయి అంటున్నారు. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుతం కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉల్లిపాయ, టమాటా ధరలు దూసుకుపోతున్నాయి. అసలు ఈ రెండు కూరగాయలు లేకుండా వంట అనేది దాదాపు అసాధ్యం. ఇక నెల రోజుల క్రితం వరకు ఉల్లి, టమాటా ధరలు కిలో 20-30 రూపాయలు ఉండగా.. ఇప్పుడు మాత్రం వాటి ధరలు భారీగా పెరిగాయి. టమాటా ధర అయతే ఏకంగా 100 రూపాయలకు చేరింది. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడం వల్ల టమాటా దిగుబడి తగ్గింది. దాంతో రేటు భారీగా పెరిగింది. అలానే ఉల్లి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు చేసి సామాన్యులు ఇబ్బంది పడుతున్న వేళ.. కేంద్రం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
దేశంలో పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ కోసం ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లి ధర రిటైల్ మార్కెట్లో రూ.40 దాటిన నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం బఫర్ స్టాక్‌ను వాడనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో.. ఉల్లి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఉల్లి ధరలను నిలకడగా ఉంచేందుకు గాను కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు సానుకూలంగా ఉండి.. వర్షాలు సమృద్ధిగా ఉండి.. పంటలు పండుతాయని.. దాంతో రిటైల్ ధరలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 20 వరకు కేంద్ర ప్రభుత్వం 70,987 టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్‌గా కొనుగోలు చేసిందని వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి తెలిపారు. గతేడాది ఇదే సమయంలో 74,071 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశారు.
గత ఏడాది ఎండ తీవ్రత, వర్షాలు తక్కువగా ఉండడంతో రబీలో దాదాపు 20 శాతం మేర ఉల్లి దిగుబడి తగ్గింది. ఇది కూడా ఉల్లి ధర పెరుగుదలకు ఓ కారణంగా చెబుతున్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది బఫర్ ఉల్లి కొనుగోళ్ల వేగం పెరగనుందని అధికారులు అంటున్నారు. ఉల్లి ధరలను కంట్రోల్ చేయడానికి గాను ప్రభుత్వం ఈ బఫర్ స్టాక్‌ను ఉపయోగించనుంది. అలానే దీనితో పాటు ఉల్లి ధరలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు నుంచి నిరంతర చర్యలు తీసుకొంటుంది. ఈ క్రమంలో గతేడాది ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకం విధించారు. అలాగే డిసెంబర్ 8, 2023న ఉల్లి ఎగుమతి నిషేధించారు. ఈ చర్యలు దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వానికి దోహదపడ్డాయి. అయితే 40 శాతం ఎగుమతి సుంకాన్ని.. ఈ ఏడాది అనగా మే 4, 2024న నిషేధం ఎత్తివేయబడింది.
ఈ ఏడాది వేడిగాలులు, ఉక్కపోత కారణంగా పచ్చికూరగాయల ఉత్పత్తి తగ్గింది. దీంతో టమోటా, బంగాళదుంప, ఉల్లి తదితర కూరగాయల ధరలు పెరిగాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఉల్లి ఉత్పత్తి దాదాపు 254.73 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. గతేడాది 302.08 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి జరిగింది. ఈసారి ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.