Idream media
Idream media
ఇపుడు గోవాకి వెళితే కాసినో చూడకుండా ఎవరూ తిరిగి రారు. నేనూ , ఒక మిత్రుడు రెంటెడ్ స్కూటర్‌లో (రోజుకి రూ.400 రెంట్. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డ్ ఇస్తే, స్కూటర్ ఇస్తారు. ఇంకే గ్యారెంటీ అడగరు) బాగా బీచ్ నుంచి పంజింకి రాత్రి 8 గంటలకి బయల్దేరాం. బూట్లు లేకపోతే కాసినో లోపలికి రానివ్వరని తెలిసి చెప్పుల షాప్ కోసం వెతికాం.
గోవాలో ప్రతి 50 అడుగులకి నాలుగు బార్లు, ఆరు వైన్ షాపులు కనిపిస్తాయి కానీ, 5 కిలోమీటర్లు వెతికినా బూట్లు అమ్మే షాప్ కనపడలేదు. చివరికి బాట షాప్ కనిపిస్తే , తక్కువ ధర ఉండే బూట్లు అడిగాం. కాసినోకి వెళ్లాలా అని సేల్స్‌మన్ అడిగాడు. వచ్చీరాగానే సెలక్షన్ కూడా లేకుండా తక్కువ ధర బూట్లు అంటే అర్థం కాసినో అని.
దరిద్రమైన ఇరుకు, గతుకుల రోడ్డులో గంటసేపు ప్రయాణం. నీళ్లలో రంగురంగుల లైట్లతో కాసినో షిప్‌లు రమ్మని పిలుస్తున్నాయి. చిన్న పడవలో ఆ షిప్ దగ్గరికి తీసుకెళతారు. స్కూటర్ పార్క్ చేసి లోపలకి వెళుతుంటే పడవ దిగి బయటికి వస్తున్న తెలుగు వాళ్లు కనిపించారు. డబ్బు పోగొట్టుకుని తిరిగి వస్తున్నారు.
“రూ.50 వేలు వచ్చింది. పోదాం రా అంటే విన్నావా? ఇంకో ఆట ఇంకో ఆట అని కూచున్నావ్. మొత్తం పోయింది. ఖర్చులకి కూడా ఎవన్ని అడుక్కోవాలి”
“నాది లక్కీ హ్యాండ్ రా, ఈ రోజు ఎందుకో రివర్స్ అయ్యింది”
“తొక్కలో లక్కీ హ్యాండ్, ఐదు బీర్లు తాగితే ఇంకేం లక్”
ఇలా కొట్లాడుకుంటూ తిట్టుకుంటున్నారు.
మా బోట్ స్టార్ట్ అయ్యింది. పెద్ద దూరం కాదు, అంతా 200 మీటర్లు.
కాసినోలోకి ఎంటర్ అవగానే కళ్లు తిరిగాయి. సినిమాలో చూడటం తప్ప నిజంగా ఎపుడూ చూడలేదు. రకరకాల జూదాలు, వందల మంది జనం. ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఎక్కువగా కొత్త జంటలు.
రకరకాల డ్రింక్స్, స్నాక్స్ ట్రేల్లో తిరుగుతున్నాయి. ఏం చెప్పినా ఐదు నిమిషాల్లో వస్తాయి. ఎంట్రీ టికెట్‌తో ఇవన్నీ ఫ్రీ. జనం ఎంత తాగితే అంత జూదమాడుతారు. అదీ లాభం.
నాకు జూదంపై పెద్ద ఆసక్తి ఉండదు. ఎన్నోసార్లు జీవితంతోనే జూదం ఆడాను కాబట్టి. మా మిత్రుడు రంగంలోకి దిగాడు. నేను కూడా కొన్ని కాయిన్స్ తీసుకున్నా.
రూలెట్ టేబుల్ ముందు కూచున్నా. ఒక గోలీని చక్రంలో తిప్పుతారు. ఏ నెంబర్ దగ్గర ఆగితే దాని మీద పెట్టిన కాయిన్స్‌కి 36 రెట్లు ఇస్తారు. ఎక్కువ మంది ఇదే అడుతున్నారు. కొంత మంది Black Jack అనే పేకాట ఆడుతున్నారు.
ఆ చక్రం తిరుగుతున్నప్పుడు కిటకిటమనే సౌండ్‌కి అనవసరమైన టెన్షన్. కాసేపు ఆడితే ఈ నెంబర్లతో మనకు స్నేహం ఏర్పడుతుంది. కొన్ని అనుకూలంగా , ప్రతికూలంగా కనిపిస్తాయి. నాకు జూదం అంటే ఇష్టం లేకపోవడానికి ఇదో కారణం. ఎక్కువ సేపు పేకాట ఆడితే , నిద్రలో ఆ నెంబర్లన్నీ కలలోకి వచ్చి భయపెడతాయి. మనుషులతోనే చస్తుంటే, ఇక నెంబర్లు కూడా భయపెడితే ఎలా?
ఒక బీహార్ కుర్రాడు అన్ని టేబుల్స్ మీద బెట్ కడుతూ , హడావుడిగా తిరుగుతూ , మధ్యలో మందు తాగుతూ బోలెడు డబ్బు పోగొడుతున్నాడు. ఒక హనిమూన్ జంటలో భర్త ఆడుతున్నాడు. ఇక చాలన్నట్టు ఆ అమ్మాయి చూస్తోంది. ఇపుడు డబ్బే పోగొడుతున్నాడు, వాడు మొగుడిగా మారేకొద్ది మనశ్శాంతి కూడా పోగొడతాడు.
గౌన్ వేసుకున్న ఒక ఆవిడ పిచ్చపిచ్చగా ఆడేస్తుంటే, మొగుడు తల గీరుకుంటూ దీనంగా చూస్తున్నాడు. రకరకాల భాషలు, మనుషులు కానీ అందరి సైకాలజీ ఒకటే, డబ్బు గెలవాలి.
కాసినో నిర్వాహకులు చాలా స్టైల్‌గా ఫుల్ సూట్‌లో ఉన్నారు. బెట్టింగ్ డీల్ చేస్తున్న అమ్మాయిలంతా నార్త్ ఈస్ట్ వాళ్లు. ఏ భావం లేకుండా కాయిన్స్ ఊడుస్తూ , గెలిచిన వారికి ఇస్తూ ఉన్నారు. టేబుల్ పైన సీసీ కెమెరా ఉంటుంది. అంతా దాని కనుసన్నల్లోనే జరగాలి. దీంట్లో ఏమైనా మోసం ఉందో లేదో తెలియదు.
డ్రైవింగ్ ఉంది కాబట్టి చిన్న బీర్ తప్ప ఇంకేమీ తీసుకోలేదు. సర్వ్ చేస్తున్న కుర్రాడు మేము తెలుగు వాళ్లమని గుర్తు పట్టాడు. తనది రేణిగుంట అన్నాడు. ఇక్కడెందుకు పనిచేస్తున్నావని అడిగితే డబ్బు సంపాదించుకోడానికి అని అన్నాడు.
కాసినో ఆడితే డబ్బులొస్తాయ్ కానీ, పనిచేస్తే వస్తాయా అన్నాను. టిప్స్ బాగా వస్తాయన్నాడు. డబ్బు సంపాదించి సినిమా డైరెక్టర్ అవుతాడట. తనకి దక్కిన దాంతో సుఖంగా ఉండటం మనుషులకి చేతకాదు. కలలు లేకపోతే జీవితం దరిద్రంగా ఉంటుందేమో!
నాకు సినిమా వాళ్లు తెలుసు అంటే, అప్పటికప్పుడు ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చేస్తానన్నాడు. వచ్చే ముందు తన సుపీరియర్‌ని తన్నేసి వస్తాడట. వాడు హరాస్‌మెంట్ ఎక్కువగా ఉందట. హింస జీవన సూత్రంగా మారిపోయింది. ఒకరినొకరు హింసించుకోకుండా బతకలేక పోతున్నారు.
అక్కడి నుంచి పై ఫ్లోర్‌కి వెళితే అక్కడ అందర్ బాహార్ జరుగుతోంది. అన్ని టేబుళ్ల దగ్గర కిటకిటలాడుతూ తెలుగువాళ్లు. వాళ్లలో ఎక్కువ మంది రాయలసీమ వాళ్లు. “బెయ్” అని ఒకడు, “మచ్చా” అని ఇంకొకడు అడుతున్నారు. డబ్బులు పోతున్నాయి. రాయలసీమలో కరువు అని తెలుసు. ఆ కరువుకి కారణమైన వాళ్లంతా ఇక్కడ కాసినోలో ఉన్నారు.
ఒకసారి కింగ్ మీద ఆడాను, పోయింది. రాణి మీద కూడా పోయింది. అన్ని కాలాల్లోనూ రాజులు, రాణులు మోసం చేస్తారు.
ఆకలేసి డైనింగ్ ఫ్లోర్‌కి వెళితే , అద్భుతమైన భోజనం, పులిహోర కనిపించింది. తెలుగు వాళ్ల కోసం స్పెషల్ అని చెప్పారు. తినడంలోనే కాదు, పులిహోర కలపడంలో కూడా మనవాళ్లు స్పెషలిస్ట్‌లు. రసం అన్నం, నాన్ వెజ్ ఐటమ్స్, సలాడ్స్ ఫుల్‌గా లాగించాం.
అర్ధరాత్రి 2 దాటింది. డబ్బు పోయినవాళ్లు ఉన్నదంతా ఆడుతున్నారు. ఆ టైంలో కూడా కొత్తవాళ్లు వస్తున్నారు. రాత్రిపగలూ తేడా లేదు. మనుషులు కొత్తవాళ్లు వచ్చి, పాతవాళ్లు వెళుతుంటారు. ఆట ఆగదు. జూదంలో కూడా జీవన సత్యం ఉంది.
డబ్బు రాలేదు, పోలేదు. బయటికి రావడానికి ఇదే కరెక్ట్ టైం. జూదంలో ఎప్పుడు పైకి లేవాలో తెలుసుకోవడం అసలైన జ్ఞానం.
స్కూటర్ స్టార్ట్ అయ్యింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సుదీర్ఘమైన పంజిం ఫ్లై ఓవర్ కింద చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు….
నేను ఎవర్ని?, గోవాలో చలి రాత్రుల్లో , చీకటిలో ఎక్కడికి ప్రయాణిస్తున్నాను? చాలా ప్రయాణాలకు గమ్యం ఉండదు. ఎపుడు చూడని రోడ్లపై నువ్వు హఠాత్తుగా ప్రయాణిస్తావు. అదే జీవితం.
ప్రశ్నలు వేసుకునే వాళ్లకి అన్నీ సమస్యలే. ప్రశ్నతో పనిలేకుండా జీవించే వాళ్లకి ఏ సమస్యా లేదు.
కానీ ప్రశ్నించిన వాళ్లే ప్రపంచానికి గుర్తు ఉంటారు.
ప్రశ్నించకుండా జీవించిన వాళ్లు సమాధుల మీద పేర్లు రూపంలో మిగిలిపోతారు.