iDreamPost
android-app
ios-app

ఇనార్బిట్ మాల్‌లో ఒక సాయంత్రం

ఇనార్బిట్ మాల్‌లో ఒక సాయంత్రం

ప్ర‌యాణం లేక‌పోతే జీవిత‌మే లేదు. క‌రోనా వ‌చ్చి మ‌నుషుల్ని క‌ద‌ల‌కుండా చేసింది. అస‌లు క‌రోనాకి కార‌ణం ప్ర‌యాణ‌మే. ఒక‌ప్పుడు క‌ల‌రా, ప్లేగు ఎన్ని వ‌చ్చినా అవి ఆయా ప్రాంతాల‌కే ప‌రిమితం. ఎప్పుడైతే ప్ర‌పంచం చిన్న‌దైందో వ్యాధులు పెద్ద‌వైపోయాయి. గ్లోబ్‌లో ఎక్క‌డికైనా వెళ్ల‌గ‌లం అనుకున్నాం కానీ, క‌రోనా కూడా అలాగే అనుకున్న‌ద‌ని తెలుసుకోలేక పోయాం. ప్ర‌యాణం లాగే , క‌రోనా కూడా అనివార్యం.

నాలుగు నెల‌లు దాటింది. రైళ్లు లేవు, బ‌స్సులు లేవు. ఆటోలు, క్యాబ్‌లు ఉన్నా ఎక్క‌డానికి భ‌యం. కోడి త‌న రెక్క‌ల కింద పిల్ల‌ల్ని అదుముకున్న‌ట్టు , సిటీ బ‌స్సులు జ‌నాల‌తో తిరిగేవి. నెత్తిమీద గ‌ర్వంగా నెంబ‌ర్ల బోర్డు పెట్టుకుని తిరిగే సిటీ బ‌స్సుల్ని చూసి చాలా కాల‌మైంది.

ఆటోలు, క్యాబ్‌లు ఫైనాన్షియ‌ర్స్ ద‌గ్గ‌రికి చేరిపోతున్నాయి. ఒక‌ప్పుడు జ‌నాల్ని నిండా కుక్కుకుని వెళ్లిన స‌ర్వీస్ ఆటోలు దిగాలు ప‌డిపోయాయి. రైలు కూత కోసం ఊళ్ల‌కు ఊళ్లు ఎదురు చూస్తున్నాయి. ఒక రైలు దారి పొడ‌వునా వేల మందిని బ‌తికిస్తుంది. రేణిగుంట‌లో స‌మోసాలు అమ్మే కుర్రాడి ద‌గ్గ‌రి నుంచి , నంద‌లూరు రైల్వేగేటు ద‌గ్గ‌ర శ‌న‌క్కాయ‌లు అమ్మే ముస‌ల‌మ్మ వ‌ర‌కు ఇంజ‌న్ శ‌బ్దం కోసం వేయి చెవుల‌తో ఎదురు చూస్తున్నారు.

మ‌నుషులు తిర‌గ‌డం ఆగిపోతే బ‌తుకు ఆగిపోతుంది. ముంబ‌య్‌లో డ‌బ్బావాలాల నుంచి తిరుమ‌ల న‌డ‌క దారిలో దోసెలు పోసే వాళ్ల వ‌ర‌కూ మాన‌వ స‌మూహం కోసం నిరీక్షిస్తున్నారు.

నెల‌లో ఒక‌సారైనా బుక్‌స్టోర్‌కు వెళ్ల‌డం అల‌వాటు. ఈ మ‌ధ్య కొన్ని నెల‌లు గ్యాప్‌. క‌రోనా మ‌న అల‌వాట్ల‌న్నింటిని మార్చేసింది. గ‌త వారం తెగించి టూవీల‌ర్‌లో ఇనార్బిట్ మాల్‌కి వెళ్లాను. పార్కింగ్ టోక‌న్ ఇచ్చేవాళ్లు లేరు. చెక్ చేసేవాళ్లు లేరు. ఎస్క‌లేట‌ర్‌లో కూడా దూరం పాటించ‌డానికి పాద‌ముద్ర‌లు వేశారు. అనేక షాపులు మూసేశారు. ఒక షాప్ ముందు అప్‌నా టైమ్ ఆయేగా (మా టైమూ వ‌స్తుంది) అని రాశారు. వాళ్ల కాన్ఫిడెన్స్‌కి ముచ్చ‌టేసింది.

బుక్‌స్టోర్‌లో ఒక క‌స్ట‌మ‌ర్ కూడా లేడు. కొత్త పుస్త‌కాలు కూడా లేవు. బ‌ట్ట‌ల షాపులు జ‌నం కోసం ఎదురు చూస్తున్నాయి. ఫుడ్ కోర్టులో మ‌టుకు కొంత మంది ఉన్నారు. వాళ్లు కూడా ఏదో భ‌యంతో చాలా జాగ్ర‌త్త‌గా తింటున్నారు. మునుప‌టి ఆనందం, కబుర్లు లేవు. కేఎఫ్‌సీ ముందు గ‌తంలో క్యూ ఉండేది. ఇపుడు వ‌ర్క‌ర్స్ మాత్రం ఉన్నారు.

థియేట‌ర్‌లు ఉన్న ఫ్లోర్‌ని మూసేశారు. కొత్త సినిమాలు వ‌స్తే ఆ సంద‌డి చూడ్డానికి క‌ళ్లు పెద్ద‌వి చేయాల్సి వ‌చ్చేది. పిల్ల‌ల ప్లే ఏరియా కూడా క్లోజ్ చేశారు. ఒక‌ప్పుడు ప‌సిబిడ్డ‌ల అల్ల‌రితో అక్క‌డో పండ‌గ జ‌రిగేది. బాబు హుషార్‌గా బైక్ న‌డుపుతుంటే వెనుక అమ్మానాన్న‌ల క‌ళ్ల‌లో సంతోషం.

వీకెండ్స్‌లో ఫుడ్ కోర్టులో సీటు దొరికేది కాదు. అమ్మాయిలు, అబ్బాయిల క‌బుర్లు, కేక‌ల‌తో ఒక ఉత్స‌వం క‌నిపించేది. న‌లుగురు క‌లిస్తేనే న‌వ్వులు విర‌బూస్తాయి. ఇపుడు న‌లుగురిలోకి వెళితేనే ప్ర‌మాదం అంటోంది క‌రోనా.

మాల్ నుంచి ఇంటికొస్తుంటే ఆ రోడ్ల‌న్నీ వైభ‌వం కోల్పోయిన‌ట్టున్నాయి. కిట‌కిట‌లాడుతూ ఉద‌యం, సాయంత్రం ట్రాఫిక్ జామ్ జ‌రిగేది. ఐటీ ఏరియా కాబ‌ట్టి వేల మంది ఉద్యోగులు క‌నిపించేవాళ్లు. గూడు చెదిరిన ప‌క్షుల్లా చెల్లాచెదురై పోయారు. కొన్ని వంద‌ల టీ, టిఫెన్ బ‌ళ్లు ఉండేవి. ఇపుడు అక్క‌డొక‌టి, ఇక్క‌డొక‌టి ఉన్నాయి. అక్క‌డ కూడా మ‌నుషులు లేరు. క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఏరియాలో కొన్ని వేల మంది కార్మికులు నెత్తి మీద హెల్మెట్ లాంటి క‌వ‌చంతో చీమ‌ల్లాగా తిరిగే వాళ్లు. జీవితం అంతా స్తంభించి పోయింది.

దారిలో ఉండే షాగౌస్ హోట‌ల్ ముందు తుళ్లిప‌డే యువ‌జ‌న సందోహం ఉండేది. అంతా మాయం. రంజాన్ రోజుల్లో సాయంత్రం వేళ‌ల్లో అక్క‌డ హ‌లీమ్ తిన‌డం ఒక ముచ్చ‌ట‌. ఈ సారి క‌రోనా అన్ని పండ‌గ‌ల‌పైన ప‌గ బ‌ట్టింది.

ఈ రోజు కాక‌పోతే రేపైనా క‌రోనా ఓడిపోతుంది. మ‌నుషులు మ‌ళ్లీ షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటారు, కౌగిలించుకుంటారు, మాస్క్ లేకుండా మాట్లాడుతారు. స్కూల్ బ‌స్సుల్లో పిల్ల‌లు చేతులు ఊపుతూ వెళుతారు. పార్కుల్లో ఆడుకుంటారు. బ‌తుకు చిగురిస్తుంది. స‌ర్వీస్ ఆటోలు జ‌నాల‌ను నింపుకుంటాయి. సిటీ బ‌స్సుల్లో వేలాడుతారు. ప్లాట్‌ఫారాల్లో చాయ్ చాయ్ అని వినిపిస్తుంది. పోర్ట‌ర్లు సామాన్లు మోసుకు తిరుగుతారు. క్యాబ్‌లో డ‌బ్బులు త‌గ్గుతామ‌ని షేర్‌లో ఎక్కుతాం. ఉచితంగా హైద‌రాబాద్‌లో ఎన్న‌డూ చూడ‌ని గ‌ల్లీలు చూపిస్తాడు.

థియేట‌ర్‌లో బొమ్మ ప‌డుతుంది. మ‌న నోట్లో విజిల్ వ‌స్తుంది. షూటింగ్‌లు స్టార్ట్ అవుతాయి. జూనియ‌ర్ ఆర్టిస్టులు కూడా క‌డుపు నిండా తింటారు. కెమెరా రోల్ అవుతుంటే క‌రోనా యాక్ష‌న్‌లో ఉంది. ప్ర‌కృతి దీనికి క‌ట్ చెబుతుంది.

మ‌నుషులు అన్నీ త‌ట్టుకుంటారు. అన్నీ జ‌యిస్తారు. యుద్ధాలు, తుపాన్లు, క‌రువులు, సునామీలు, భూకంపాలు, క‌ల‌రా, ప్లేగు, ఎయిడ్స్ ఎన్నో చూసిన వాళ్లు. ఎన్నింటినో ఎదురించిన వాళ్లు. మ‌రిచిపోయిన వాళ్లు.

అయితే క‌రోనాతో మ‌నం ఏమి నేర్చుకున్నాం? ఇది ఎవ‌రికి వాళ్లు వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌. ప్ర‌తి ఒక్క‌రూ చాలా నేర్చుకుని ఉంటారు. మంచిత‌నం, దుర్మార్గం, లోభ‌త్వం, దురాశ‌, మాన‌వ‌త్వం, ఆత్మ‌జ్ఞానం, అహంకారం ఇవ‌న్నీ మ‌న‌లో ఉన్న‌వే. అయితే మ‌నం ఏ కేట‌గిరీ అన్న‌ది క‌రోనా నిరూపించింది. రాయ‌డానికి మ‌న‌సు ఒప్పుకోక పోవ‌చ్చు. రాస్తే మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌డిదీ ఒక్కో గ్రంథ‌మే.