iDreamPost
android-app
ios-app

వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

దేశంలో దూర తీరాలకు, గమ్యస్థానాలకు చేర్చే ప్రయాణ సాధనాలు రైళ్లు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో పెను మార్పులు సంతరించుకుంటున్న సంగతి విదితమే. వేగవంతంగా, సురక్షితంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లు వచ్చాయి. గజిబిజీ పరుగుల మధ్య జీవనం సాగిస్తున్న ప్రజలు.. దూరాలకు వెళ్లే ప్రయాణీకులు ఈ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభించింది. అదే సమయంలో డిమాండ్ కూడా ఏర్పడింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 25 సర్వీసులను ప్రారంభించింది మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరిన్ని రైళ్లను తీసుకువచ్చేందుకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 24న ప్రధాని మోడీ చేతుల మీదుగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.

త్వరలో ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో సహా కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఒకే రోజు రికార్డు స్థాయిలో తొమ్మిది రైళ్లను వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుండి జెండా ఊపి ప్రారంభించనున్నారు మోడీ. ఈ తొమ్మిది రైళ్లకు సంబంధించిన రంగుల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. కేరళలోని కాసర్ గఢ్, త్రివేండ్రం మార్గంలో రాబోతున్న తొలి ఎక్స్ ప్రెస్ రైలు ఆరెంజ్ రంగులో ఉండనుండటం గమనార్హం. మిగిలిన ఎనిమిది బ్లూ-వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్నాయి. ఈ సర్వీసులతో కలిసి దేశంలో మొత్తం వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు 34కు చేరునున్నాయి. అలాగే భవిష్యత్తుల్లో మరో 10 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను సిద్ధం చేయాలన్న ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

నూతనంగా ప్రారంభించబోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే మార్గాలు..

ఇండోర్-జైపూర్
జైపూర్-ఉదయ్ పూర్
పూరి-రూర్కెలా
పాట్నా-హౌరా
జైపూర్-చండీగఢ్
చెన్నై-తిరునెల్వేలి
రాంచీ-హౌరా
జామ్‌నగర్-అహ్మదాబాద్
చెన్నై-హైదరాబాద్