Idream media
Idream media
గళ్ల చొక్కా.. వెనుక బ్యాగ్ తగిలించుకుని చీకట్లో దీనంగా కూర్చొన్న ఈయనను చూస్తే జాలేస్తుందా.. పాపం ఇంతను ఏదైనా నిరసన తెలియచేయడానికి కూర్చొన్నాడని అనుకుంటున్నారా.. అవును నిరసన తెలియచేస్తున్నాడు.. కానీ ఇతనేమీ సామాన్యుడు కాదు.. ఓ ఐపీఎస్ అధికారి.. బెంగూళూరులో ఎస్పీగా పనిచేస్తున్నారు.. మరి ఎస్పీ ఏంటి ఇలా కూర్చొన్నాడనుకుంటున్నారా.. అవును ఆయన ఎస్పీనే కానీ ఒక తండ్రి.. కన్నబిడ్డల్ని చూడటానికి అర్థరాత్రి ఇలా రోడ్డుపై నిరసనకు దిగడంతో ఇప్పుడు అందరూ ఈయన గురించే చర్చిస్తున్నారు. తన చిన్నారులను కలవడానికి ఆమె నిరాకరించడంతో ఆ మాజీభార్య మనసు కరగాలని ఇలా నిరసన చేపట్టాడు.. ఇంతకీ ఆమెకూడా ఐపీఎస్ అధికారిణే కావడం ఇక్కడ విశేషం..
బెంగళూరులోని కాలబురగి పోలీస్ అంతర్గత భద్రతా విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పీ)గా విధులు నిర్వర్తిస్తున్నరంగరాజన్, ఆయన మాజీ భార్య కూడా డీసీపీ స్థాయి అధికారిణిగా పనిచేస్తోంది. వీళ్లిద్దరూ ఛత్తీస్‌ఘడ్‌లో పని చేస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. అక్కడే ఉంటున్నపుడు వీరికి మొదటి సంతానం కలిగింది. ఆసమయంలో ఉద్యోగంలో ఇద్దరికీ తరచూ ట్రాన్స్ ఫర్లు అవుతుండడం, ఒత్తిడి కారణంగా భార్యా భర్తలిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఈ ప్రోసెస్ లోనే మరోబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇద్దరు పిల్లలున్న ఈజంటకు 2015లో సదరు కోర్టు విడాకులు మంజూరుచేసింది.
ఇదిలా ఉంటే రంగరాజన్ తన పిల్లల్ని చూసేందుకు ఆదివారం బెంగళూరులోని వసంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న తన మాజీభార్య ఇంటికి వెళ్లాడు. కానీ ఆ ఐపీఎస్ మాత్రం రంగరాజన్‌ను ఇంట్లోకి రానివ్వలేదు.. దీంతో ఆయన మాత్రం పిల్లల్ని చూసేంతవరకు అక్కడనుంచి కదిలనని బయటే బైఠాయించాడు. ఈఘటనతో తన మాజీభర్త వేధిస్తున్నాడని ఆమె కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు స్పందించి వచ్చినా వాళ్లిద్దరూ తమశాఖకు చెందినవారే కావడం.. పైగా ఇద్దరూ ఉన్నత స్థాయి క్యాడర్ కు చెందిన పోలీసులే కావడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఏమీ చేయలేక స్థానికంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులను రప్పించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని రంగరాజన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. కానీ రంగరాజన్ పిల్లల్ని చూసేవరకూ తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పడం.. మీరే సామరస్యంగా సమస్యను తేల్చుకోవాలని, తాము చేసేదేమీ లేదని చెప్పి పోలీసులు వెళ్లిపోయారు. అనంతరం తన పిల్లల్ని చూసుకుని రంగరాజన్ వెళ్లిపోయినట్టు సమాచారం.