iDreamPost
iDreamPost
థియేటర్ సినిమాలు తక్కువ టైంలో ఓటిటికి ఇచ్చే వెసులుబాటు వద్దనుకుంటే నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కి వెళ్లిపోవడం ఇప్పుడు బడ్జెట్ మూవీస్ కున్న బెస్ట్ ఆప్షన్. క్రమంగా వెండితెరకు స్మార్ట్ స్క్రీన్ కు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా మారుతున్న తరుణంలో కేవలం వెబ్ కోసమే తీస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఆహా లాంటి ఓన్లీ తెలుగు యాప్స్ వీటి మీద ప్రత్యేక దృష్టి సారించాయి. గత వారం ఆనంద్ దేవరకొండ హైవేని ఓటిటిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కాబట్టి ఎక్కువ శాతం చూస్తున్నారు కానీ ఇది కనక థియేటర్ కు వెళ్లుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఆహా మరో క్రైమ్ థ్రిల్లర్ ని తీసుకొచ్చింది. అదే ఓదెల రైల్వేస్టేషన్
దీనికి రచ్చ, గౌతమ్ నందా, సీటిమార్ దర్శకుడు సంపత్ నంది రచన చేయడం విశేషం. ఐఏఎస్ శిక్షణ కోసం ఓదెల గ్రామానికి వచ్చిన అనుదీప్ (సాయి రోనక్)కు ఓ ప్రమాదకరమైన కేసు స్వాగతం పలుకుతుంది. కొత్త పెళ్లికూతుళ్లు శోభనం జరిగిన మరుసటి రోజే అతి దారుణంగా హత్య చేయబడతాడు. సైకో కిల్లర్ ఎవరో అంతుబట్టక అనుదీప్ హంతకుడి కోసం వేట మొదలుపెడతాడు. మరోవైపు భర్త లోపం వల్ల పిల్లలు లేక రాధ(హెబ్బా పటేల్)ఆ ప్రయత్నాల్లో డాక్టర్లను కలుస్తుంది. ఇంతకీ ఆ మర్డర్లు ఎవరు చేశారు, అంత చిన్న పల్లెటూళ్ళో ఇంత పెద్ద క్రైమ్ చేసే సాహసం ఎవరిది, రాధా భర్త తిరుపతికి ఏదైనా కనెక్షన్ ఉందా లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా. హెబ్బాతో సహా ఆర్టిస్టులందరూ సహజమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.
దీని నిడివి కేవలం 93 నిమిషాలే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే చాలా మటుకు గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం జరిగింది. దర్శకుడు అశోక్ తేజ్ అనవసరమైన అంశాలకు చోటివ్వకుండా కథనాన్ని వేగంగా పరుగు పెట్టించాడు కానీ సగమయ్యాక సైకోని పట్టుకునే క్రమంలో పోలీసులు వ్యవహరించే తీరు ఏమంత థ్రిల్లింగ్ గా సాగకపోవడం మైనస్ అయ్యింది. క్లూస్ ఇవ్వకుండా సస్పెన్స్ ని బాగానే మెయింటైన్ చేశారు. మెయిన్ ట్విస్ట్ ని మాత్రం ఆశించిన స్థాయిలో రిజిస్టర్ చేయలేకపోయారు. సైకో నేపథ్యం కూడా సోసోనే. చివరిగా చెప్పాలంటే తక్కువ టైంని డిమాండ్ చేసే ఈ రైల్వేస్టేషన్ లో ఓసారి నిక్షేపంగా ప్రయాణం చేసేయొచ్చు. కాకపోతే పరిమిత అంచనాలతోనే సుమా