iDreamPost
android-app
ios-app

మాటేరాని చిన్నదాని ఎమోషన్ – Nostalgia

  • Published Aug 25, 2021 | 11:25 AM Updated Updated Aug 25, 2021 | 11:25 AM
మాటేరాని చిన్నదాని ఎమోషన్ – Nostalgia

గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం ఆలపించిన గొప్ప గీతాలను లిస్ట్ అవుట్ చేసుకుంటే టాప్ 10లో చోటు చేసుకునే పాట మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. 1990లో వచ్చిన ఓ పాపా లాలి సినిమా కోసం ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ పాటలో చరణాలను బాలు ఊపిరి పీల్చకుండా పాడిన తీరు ఈ రోజుకీ కొత్తగా విన్నవాళ్లను సైతం అప్రతిభులను చేస్తుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే తర్వాత శంకర్ మహదేవన్ లాంటి గాయకులు ప్రైవేట్ ఆల్బమ్స్ లో, శ్రీ మంజునాథ సినిమాలో ఇదే ప్రయత్నం చేసి గొప్ప ఫలితాన్ని అందుకున్నారు. అయితే ఈ చిత్రం గురించిన అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ. అందుకే ఆ విశేషాలేంటో చూద్దాం.

ముప్పై ఏళ్ళ క్రితం నిర్మాత సుందరం బాలచందర్ అసిస్టెంట్ వసంత్ ని కలిసి ఓ సినిమా తీసే ప్రతిపాదన ముందుంచారు. అప్పటికింకా తనవద్ద ఏ కథా లేదు. గురువు గారి బృందంలో మిత్రుడు అనంతు చెప్పిన పాయింట్ ఒకటి బాగా నచ్చి తన స్క్రీన్ ప్లే జోడించి దాన్నే తెరకెక్కించేందుకు నిర్ణయించుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా మధ్యవయసులో ఉన్న ఒక జంటతో మెచ్యూర్డ్ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్నారు. కేలడీ కన్మణి టైటిల్ ఫిక్స్ అయ్యింది. దాదాపు హీరోలాంటి ప్రధాన పాత్ర పోషించేందుకు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు తటపటాయిస్తే వసంత్ పట్టుబట్టి మరీ ఒప్పించారు.

సుహాసినిని ఫస్ట్ ఛాయస్ గా అనుకుంటే డేట్ల సమస్య వల్ల ఆ అవకాశం రాధికను వరించింది. ముందు అనుకున్న పేరున్న హీరో బదులు రమేష్ అరవింద్ వచ్చి చేరాడు. అప్పటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అంజుని హీరోయిన్ గా ఎంచుకున్నారు. నాగార్జున గీతాంజలిలో చిన్న పాపగా చేసిన బేబీని ఫ్లాష్ బ్యాక్ కోసం తీసుకున్నారు. తన వల్ల ఒక్కటి కావాల్సిన జంట విడిపోతే వాళ్ళను కలిపేందుకు తాపత్రయపడుతూ జబ్బుపడి బ్రతుకుతానో లేదో తెలియని ఓ అమ్మాయి చుట్టూ ఈ కథను ప్రెజెంట్ చేసిన తీరు ఎమోషనల్ గా జనానికి కనెక్ట్ అయ్యింది. తమిళంలో బ్లాక్ బస్టర్ కొట్టి సిల్వర్ జూబ్లీ ఆడింది. తెలుగులో ఓ పాపా లాలిగా డబ్బింగ్ చేస్తే యావరేజ్ అయ్యింది. అయినా కూడా ఆ ఒక్క పాట మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని మధురగీతంగా నిలిచిపోయింది

Also Read : ప్రిన్స్ కు నచ్చినది కొందరే మెచ్చారు – Nostalgia