iDreamPost
android-app
ios-app

no parking fine అక్క‌డి పార్క్ చేస్తే డబుల్ ఫైన్, షాపుల నిర్వాహ‌కుల‌కుకూడా!

  • Published May 27, 2022 | 11:45 AM Updated Updated May 27, 2022 | 11:46 AM
no parking fine అక్క‌డి పార్క్ చేస్తే డబుల్ ఫైన్, షాపుల నిర్వాహ‌కుల‌కుకూడా!

హైద‌రాబాద్ సిటీలో కొన్ని చోట్ల యమర‌ద్దీ. పార్క్ చేయ‌డానికి ప్లేస్ లే ఉండ‌వు. చాలామంది జ‌స్ట్ రోడ్డుమీదే పార్క్ చేసి, ప‌నులు చూసుకొంటాఉరు. అమీర్ పేట‌, కోఠి, జూబ్లిహిల్స్, బంజార హిల్స్, మెహ‌దీప‌ట్నం, దిల్ సుఖ్ న‌గ‌ర్ లాంటి చోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువ‌. ఇక్క‌డ షాపులెక్కువ‌, పార్కింగ్ ప్లేస్ త‌క్కువ‌. ర‌ద్దీ స‌మ‌యంలో ఈరోడ్ల‌లో వెళ్తే స‌మ‌స్య ఏంటో మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది. అందుకే ఈ ప్రాంతాల‌ను ట్రాఫిక్ ప‌రంగా స‌మ‌స్యాత్మ‌కం(కంజెషన్‌ జోన్‌) గా గుర్తించారు సిటీట్రాఫిక్ పోలీసులు.

పేర్ల‌ను బ‌ట్టికాకుండా, అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పక్కాగా వీటిని మార్క్ చేస్తారు. ఈ ప్రాంతాల్లో పార్కింగ్స్ చేస్తే రెట్టింపు జరిమానా వేయాలన్న‌ది ప్లాన్. ఫైన్ల తో భ‌య‌పెడితేకాని జ‌నం దారికిరాన్న‌ది ట్రాఫిక్ విభాగం ఆలోచ‌న‌. ఇప్ప‌టిదాకా నో పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌లను వేర్వేగా చూడ‌టంలేదు. రెండింటికి ఒక‌టే ఫైన్. ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాలు అంటే కంజెషన్‌ జోన్ గా గుర్తించిన త‌ర్వాత రెంటికీ వేర్వేరుగా జరిమానాలు విధించనున్నారు. నోపార్కింగ్ జోన్ లో ఒక‌వేళ‌ రూ.200 ఫైన్ ఉంటే, ఇబ్బందికర పార్కింగ్ చేస్తే అది డ‌బుల్ రూ.400 కానుంది.

ఇక్క‌డే ఒక స‌మ‌స్య‌. వ్యాపార సంస్థ‌ల‌కు అనుమ‌తినిచ్చే ముందే అస‌లు వాళ్లద‌గ్గ‌ర పార్కింగ్ ప్లేస్ ఉందా? లేదా? అన్న‌ది చూడ‌టంలేదు. ఎవ‌రైనా షాపింగ్ వెళ్తే ఎక్క‌డ పార్క్ చేయాలి? ఇదో చిక్కు ప్ర‌శ్న‌. ఇప్పటి వరకు పార్కింగ్‌ ఉల్లంఘనపై కేవలం బైక‌ర్లు, కార్ల య‌జ‌మానులకే ఫైన్ ప‌డుతోంది. ఇప్పుడు వీళ్ల‌తోపాటు వ్యాపార సంస్థలు, దుకాణాల నిర్వాహకులనూ బాధ్యులను చేయాలన్న‌ది ట్రాఫిక్‌ పోలీసుల మాట‌. జీహెచ్‌ఎంసీ అధికారులతో చ‌ర్చిస్తున్నారు. త్వ‌ర‌లోనే యాక్ష‌న్ ప్లాన్ ను త‌యారుచేస్తారు. వ్యాపార‌సంస్థ‌ల‌కు అనుమ‌తినిచ్చేది, రోడ్ల‌ను మెయింటైన్ చేసేది జీహెచ్ ఎంసీయేక‌దా.

మోటారు వాహనాల చట్టం ప్రకారం వ్యాపారసంస్థ‌ల‌ నిర్వాహకులపై ఎలాంటి చ‌ర్య‌లు లేవు. సిటీ పోలీసు యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేస్తున్నారు. కాని ఫైన్ మాత్రం చాలా త‌క్కువ. ఇంకేం భ‌యముంటుంది? ఇప్పుడు వాళ్ల‌కూ ఫైన్, రెండింత‌లు చేస్తే అంద‌రూ దారికొస్తారన్న‌ది హైద‌రాబాద్ సిటీపోలీసుల మాట‌.