నివర్‌ తీరం దాటింది

తమిళనాడు, పుదుచ్చెరి రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులకు కంటిమీద కునుకులేకుండా చేసిన నివర్‌ తుపాను తీరం దాటింది. నిన్న రాత్రి 11:30 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజాము 2:30 గంటల మధ్యలో కలైకర్, మహాబలిపురం మధ్య తీరం దాటిందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 – 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు పేర్కొంది. చెన్నై, పుదుచ్చెరిలో నిన్నటి నుంచే భారీ వర్షం పడుతోంది. ప్రస్తుతం తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు రెట్టింపయ్యాయి.

అతి తీవ్రత నుంచి.. తీవ్ర తుపాను..

నివర్‌ తుపాను తీవ్ర కొద్దిమేర తగ్గడం కొంత ఉపసమనం కలిగిస్తోంది. అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారిన నివర్‌ తీరం దాటింది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ఆ తర్వాత వాయు గుండంగా, తీవ్ర వాయుగుండంగా మారింది. వాయుగుండం తుపానుగా, తీవ్ర తుపానుగా, అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. మళ్లీ తీవ్ర తుపానుగా తగ్గి తీరం దాటింది. దీని ప్రభావం రేపటి వరకూ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకూ విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది.

ఏపీపైనా ప్రభావం..

నివర్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌పైనా ప్రభావం చూపుతోంది. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం పడింది. నగరంలో లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రకాశం, చిత్తూరు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ నిన్నటి రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయక బృందాలను పంపింది. ఈ మూడు జిల్లాలకు 179 మందితో కూడిన 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 85 మందితో కూడిన నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్లాయి.

Show comments