Idream media
Idream media
బీహార్‌లో కీలకమైన మూడవ,తుది దశ ఎన్నికల ప్రచారం ముగింపు దశలో అధికార ఎన్డీయే కూటమిలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.మిత్రపక్షాలైన బీజేపీ,జేడీయూల మధ్య పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చిచ్చుపెట్టింది.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ల మధ్య ఘాటైన విమర్శలు స్వపక్షంలో అగ్గి రాజేశాయి.
బుధవారం కతియార్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఏఏ అంశాన్ని ప్రస్తావిస్తూ చొరబాటుదారులను దేశం నుంచి బయటకు వెళ్లగొడతామని అని వ్యాఖ్యలు చేశారు.ఇంకా బీజేపీ స్టార్ క్యాంపెయిన్ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ సీఏఏ ద్వారా పాక్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన అణిచివేతకు గురవుతున్న మైనారిటీల భద్రతకు ప్రధాని భరోసా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే చొరబాటుదారులను దేశం నుంచి తరిమి వేస్తామని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. దేశ సారభౌమత్వానికి, రక్షణకు ముప్పు కలిగించే వారిని ఎంతమాత్రం సహించం అని యూపీ సీఎం యోగి ప్రకటించాడు.
తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను సీఎం నితీశ్ కుమార్ పరోక్షంగా తూర్పార పట్టాడు. సీఎం యోగి పేరుని ఎక్కడా ప్రస్తావించకుండా జేడీయూ నేత నితీశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “ఇలాంటి విద్వేషపూరిత ప్రచారాలను ఎవరైనా చేస్తారా? అర్థం లేని ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేశారు?ఎవరిని దేశం నుండి బయటకు పంపుతారు?ఇలాంటి సాహసం చేయడానికి ఎవరికీ శక్తి లేదు? అందరూ ఈ దేశానికి చెందినవారే,అందరూ భారతీయులే. సామరస్యం, ఐక్యత, సోదరభావంతోనే కలిసి జీవించడం వల్లే దేశ పురోభివృద్ధి సాధ్యం.ఇలాంటి చెత్త వ్యాఖ్యలతో వారు దేశంలో విభజనని మాత్రమే సృష్టిస్తారు. వారికి వేరే పని ఉండదు.’’ అంటూ చెలరేగిపోయారు.
ఇక గతేడాది డిసెంబరులో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని విపక్షాలతో పాటు నితీశ్ కూడా వ్యతిరేకించారు.ఎన్‌ఆర్సీని కేవలం అసోంకి మాత్రమే వర్తింపజేయాలని,దేశవ్యాప్తంగా సీఏఏ అవసరంలేదని కేంద్ర నిర్ణయాన్ని తప్పు పట్టారు. అలాగే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసినప్పుడు కూడా మోడీ సర్కార్ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్న సీఎం నితీశ్ తాను ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించలేదని కేవలం కూటమిలోని తమను సంప్రదించకపోవడం పట్ల మాత్రమే తాము అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రకటించడం గమనార్హం.
కాగా యోగి వ్యాఖ్యలపై నితీశ్ వ్యక్తం చేయడంతో బీజేపీతో జేడీయూకు గల సైద్ధాంతిక విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. కీలకమైన చివరి దశ ఎన్నికల వేళ కలహాల కాపురంగా మారిన బీజేపీ, జేడీయూ మధ్య ఓట్ల బదలాయింపు ఎంత మేరకు జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.