నితీష్‌కుమారే సీఎం..!

ఎన్‌డీఏ కూటమిలోని జేడీయూకు బీజేపీ కన్నా సీట్లు తక్కువ రావడంతో బిహార్‌ సీఎం ఎవరు అవుతారన్న చర్చకు ఫుల్‌స్టాఫ్‌ పడింది. బిహార్‌ సీఎంగా మళ్లీ నితీష్‌కుమారే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. జేడీయూకు సీట్లు తక్కువగా వచ్చినా పొత్తు ధర్మం పాటిస్తూ ముందుగా అనుకున్న ప్రకారం నితీష్‌కుమార్‌ నేతృత్వంలోనే బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు.

బీజేపీ అగ్రనాయకత్వంతోపాటు బిహార్‌ నేతలు కూడా నితీష్‌కే జై కొట్టారు. నితీష్‌ స్థానాన్ని వేరెవరు భర్తీ చేయలేరని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ బిహార్‌ ఇంఛార్జి భూపేంద్ర యాదవ్, పార్టీ బిహార్‌ అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్, కేంద్ర మంత్రి నిత్యానంద రామ్‌లు ఒకే మాటపై ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నామని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో మరో ఆలోచనలేదని, నితీష్‌కుమారే తమ సీఎం అని వారు స్పష్టం చేశారు.

బిహార్‌ శాసన సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించింది. 243 సీట్లకు గాను ఎన్‌డీఏ కూటమి 125 సీట్లు కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 122 సీట్లు కన్నా మూడు సీట్లు ఎక్కువగా ఎన్‌డీఏ కూటమి గెలిచింది. ఎన్‌డీలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ 74 సీట్లు, జేడీయూ 43 సీట్లు, హిందుస్థాన్‌ ఆవామ్‌మోర్చా నాలుగు, వికాస్‌శీల్‌ ఇన్సాస్‌ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి.

ఇక మహా కూటమి 110 సీట్లు గెలుచుకుంది. మహా కూటమిలో ఆర్‌జేడీ 75 సీట్లు గెలుచుకుని బిహార్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 19, సీపీఐ (ఎంఎల్‌) 12, సీపీఎం, సీపీఐ రెండు సీట్లు చొప్పున గెలిచాయి. ఏ కూటమిలోనూ చేరకుండా పోటీ చేసిన ఎల్‌జేపీ ఒక స్థానంలో, ఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు మరో రెండు చోట్ల గెలిచారు.

Show comments